ప్రాణాలకు తెగించి సముద్రపు నాచు సేకరిస్తున్న మహిళలు..చీరకట్టులోనే డైవింగ్!

సూర్యోదయానికి ముందే ఆ మహిళలు సముద్రం వైపు అడుగులు వేస్తారు. వారి ఒంటిపై డైవింగ్ సూట్లు, ఖరీదైన పరికరాలు ఉండవు. చీర కట్టుకుని, అద్దెకు తెచ్చుకున్న గాగుల్స్‌ పెట్టుకుని సముద్రంలోకి దిగుతారు. నడుముకు ఒక ప్లాస్టిక్ సంచి కట్టుకుని నీటిలో మునిగి సముద్రపు అడుగున పెరిగే నాచును సేకరిస్తారు. తమిళనాడులోని రామేశ్వరంలో కొందరు మహిళలు సముద్రపు నాచు సేకరణనే జీవనాధారంగా చేసుకున్నారు.

ప్రాణాలకు తెగించి సముద్రపు నాచు సేకరిస్తున్న మహిళలు..చీరకట్టులోనే డైవింగ్!
Saree Clad Women Dive Into The Sea Every Morning With Borrowed Goggles And Plastic Sacks To Pull Seaweed From Seabed

Updated on: Nov 04, 2026 | 7:13 PM

Sea Weed Divers : గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ దీవుల సమీపంలోని సముద్రపు రాళ్లు, పగడపు దిబ్బలపై సముద్రపు నాచు పెరుగుతుంది. నాచును సేకరించేందుకు స్థానిక మహిళలు ప్రతిరోజూ సముద్రంలోకి డైవ్ చేస్తారు. చేతులకు గాయాలు కాకుండా ఓ వస్త్రం చుట్టుకుని, రబ్బరు బ్యాండ్లతో బిగించుకుంటారు. అంతకుమించి ప్రత్యేక రక్షణ పరికరాలేవీ వారి దగ్గర ఉండవు. ఈ వృత్తి వారికి కొత్తేమీ కాదు. తల్లులు, అమ్మమ్మలు, ముత్తాతల కాలం నుంచే మహిళలు సముద్రంలోకి వెళ్లి నాచు సేకరిస్తున్నారు. చిన్నప్పుడే సముద్రంలో ఈదడం, నీటి అడుగున మునిగి నాచును గుర్తించి సేకరించడం నేర్చుకుంటారు. తరతరాలుగా వస్తున్న వృత్తే నేటికీ వందలాది కుటుంబాలకు ఆదాయ మార్గం.

అద్దెకు తెచ్చుకున్న గాగుల్స్‌.. నడుముకు ప్లాస్టిక్ సంచి!

సముద్రంలో నాచు సేకరించడం అంత సులభమైన పని కాదు. అలల ఉద్ధృతి, నీటి ప్రవాహం, సముద్రపు అడుగున రాళ్లు, పగడపు దిబ్బల మధ్య మహిళలు గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. డైవింగ్ పరికరాలు, రక్షణ దుస్తులు లేకుండా గాగుల్స్, నడుముకు కట్టుకున్న ప్లాస్టిక్ సంచితోనే సముద్రంలోకి దిగుతారు. కుటుంబాన్ని పోషించాలంటే సముద్రంలోకి వెళ్లక తప్పని పరిస్థితి.  సముద్రపు నాచు సేకరణపై ప్రభుత్వ నిషేధం విధించింది. 1986లో గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ ని మెరైన్ నేషనల్ పార్క్‌గా ప్రకటించారు. దీవులు, పగడపు దిబ్బలు, సముద్ర జీవులను సంరక్షిస్తూ కొన్ని కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. అప్పుడే సముద్రపు నాచు సేకరణపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం సముద్రపు నాచు సేకరణపై ఆధారపడిన స్థానిక కుటుంబాల జీవనంపై ప్రభావం చూపింది. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్న మహిళలకు ఆదాయం లేక కష్టంగా మారింది.

సముద్రపు నాచుతో ఎన్నో ఉపయోగాలు

సముద్రపు నాచులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సహజసిద్ధమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఎంజైమ్ లు, సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి. సముద్రపు నాచును ఆహారంగా, పశువుల మేతగా, ఔషధాల తయారీలో, సౌందర్య ఉత్పత్తుల్లో, ఇంధనంగా, ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల తయారీకి అవసరమైన అగర్‌, ఆల్జినేట్‌ వంటి పదార్థాలను కూడా సముద్రపు నాచు నుంచి తయారు చేస్తారు. ఇటీవల కోళ్ల పెంపకంలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. కాలుష్యానికి గురైన నీటిలో హానికర నైట్రోజన్‌, ఫాస్పరస్‌  మూలకాలను తగ్గిస్తుంది.  సముద్రాన్ని నమ్ముకుని బతుకుతున్న ఈ మహిళల కథ వారి శ్రమకు గుర్తింపు, వారి భద్రతకు ప్రాధాన్యం ఎంత అవసరమో గుర్తుచేస్తోంది. రక్షణ పరికరాలు, వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us