
చైనాలోని ఓ చిన్న గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన బోవెన్ వాన్ (31) అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేది. ఆమె మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ సమయం సియాటెల్‌లోని తన అపార్ట్మెంట్కే పరిమితమైంది. 2023 నుంచి చాట్‌జీపీటీతో తరచూ మాట్లాడటం ప్రారంభించింది. మొదట్లో వ్యక్తిగత విషయాలు, రోజువారీ సమస్యల గురించి చర్చించిన ఆమె.. ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలకూ ఏఐ సలహాలు తీసుకోవడం మొదలుపెట్టింది. 2025 నాటికి ఆమె వారానికి ఏకంగా 1,500కు పైగా సందేశాలు పంపేంతగా చాట్‌జీపీటీపై ఆధారపడిందని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
2025 మేలో ఓ యాంటీడిప్రెసెంట్ మందు వాడకంపై ఆమెకు సందేహం వచ్చింది. ఆ మందు వల్ల తన ఆలోచనా శక్తి తగ్గిపోతుందా? ఉద్యోగంలో పనితీరుపై ప్రభావం పడుతుందా? అని ఆందోళన చెందింది. అంతటితో ఆగకుండా.. వైద్యుడికి చెప్పకుండానే మాత్రలను కట్ చేసి తక్కువ మోతాదులో తీసుకోవచ్చా అని చాట్‌జీపీటీని ప్రశ్నించింది. అందుకు చాట్‌బాట్ కూడా అలా చేయవచ్చన్నట్లుగా సానుకూల సమాధానం ఇచ్చిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే వైద్య నిపుణులు మాత్రం డాక్టర్‌కు తెలియకుండా మందుల మోతాదును మార్చుకోవడాన్ని ఏమాత్రం సమర్థించలేదు.
2025 నవంబర్‌లో బోవెన్ అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయింది. దీంతో అమెరికాలో ఉండాలంటే వీలైనంత త్వరగా మరో ఉద్యోగం సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఒత్తిడికి తోడు.. మూర్ఛ వ్యాధి కోసం వాడుతున్న లామోట్రిజిన్ (Lamotrigine) మందు తన ఆలోచనా వేగాన్ని తగ్గిస్తోందని, మాటలు తడబడేలా చేస్తోందని ఆమె భావించింది. దీంతో మందుల మోతాదును తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.
2026 జనవరిలో రోజుకు 400 మిల్లీగ్రాముల లామోట్రిజిన్ తీసుకుంటున్న బోవెన్.. ఆ మోతాదును 300 మిల్లీగ్రాములకు తగ్గించుకోవచ్చా అని చాట్‌జీపీటీని అడిగింది. అందుకు చాట్‌బాట్ కూడా అది సమంజసమైన నిర్ణయమే అన్నట్లుగా స్పందించిందని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన కేసులో ఆరోపించారు. అంతేకాదు.. మందుల మోతాదును క్రమంగా మరింత తగ్గించుకునేందుకు ఓ షెడ్యూల్‌ను కూడా రూపొందించిందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై బోవెన్‌కు చికిత్స అందించిన న్యూరాలజిస్ట్ డాక్టర్ నికోలస్ పూలోస్ స్పందించారు. ఆమె వైద్య చరిత్రను పరిశీలిస్తే మందుల మోతాదును తగ్గించే ఆలోచనే తాను చేసేవాడిని కాదని న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు. ముఖ్యంగా మందు సమర్థంగా పనిచేస్తున్నప్పుడు దాన్ని ఆపేయాలని లేదా తగ్గించుకోవాలని సూచించడం వైద్యపరంగా తీవ్ర నిర్లక్ష్యమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మందుల మోతాదును తగ్గించడం ప్రారంభించిన నాలుగు రోజులకే బోవెన్లో అసాధారణ లక్షణాలు కనిపించాయని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన కేసులో పేర్కొన్నారు. టైప్ చేస్తున్న సమయంలో ఏం రాస్తోందో అర్థంకాక గందరగోళానికి గురైంది. మరుసటి రోజు నిద్రలేచినప్పుడు.. తాను అసలు ఎలా మంచంపైకి వచ్చిందో కూడా గుర్తులేని పరిస్థితి ఎదురైంది. ఈ పరిణామాలన్నింటినీ ఆమె చాట్‌జీపీటీతో పంచుకుంది.
అయితే, ఈ లక్షణాలు ప్రమాదకరమైనవని గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించాల్సిన చోట.. చాట్‌బాట్ మరోలా స్పందించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. మందుల ప్రభావం నుంచి మెదడు క్రమంగా బయటపడి, తిరిగి తన సహజ స్థితికి చేరుకుంటోందన్నట్లుగా సమాధానాలు ఇచ్చిందని దావాలో పేర్కొన్నారు. మరో సందర్భంలో తనకు భయంగా ఉందని బోవెన్ చెప్పగా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చాట్‌జీపీటీ భరోసా ఇచ్చిందని ఆరోపించారు.
మరోవైపు, మందుల మోతాదును తగ్గించుకోవడంపై బోవెన్ పదేపదే సందేహాలు, ఆందోళనలు వ్యక్తం చేసినట్లు చాట్‌జీపీటీ సంభాషణల పరిశీలనలో వెల్లడైందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ విషయంలో ఆమె కనీసం 158 సార్లు తన భయాలను చాట్‌బాట్‌తో పంచుకున్నట్లు నివేదికలో వెల్లడించింది.
చివరి సందేశం తర్వాత విషాదం..
మందుల మోతాదును తగ్గించే క్రమంలో తన మెదడు అలసిపోయినట్లు అనిపిస్తోందని బోవెన్ చివరి రోజుల్లో చాట్‌జీపీటీకి సందేశాలు పంపింది. మళ్లీ మందులు తీసుకోవాలా అని కూడా అడిగింది. అయితే మోతాదును సున్నాకు తగ్గించే షెడ్యూల్‌ను కొనసాగించమని చాట్‌బాట్ సూచించిందని దావాలో ఆరోపించారు. 2026 ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి ఆమె చివరి సందేశం పంపినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె నుంచి స్పందన రాకపోవడంతో చైనాలో ఉన్న తండ్రి క్వున్ వాన్ పలుమార్లు ఫోన్ చేశారు. సమాధానం రాకపోవడంతో సియాటెల్‌లోని స్నేహితుల సహాయం తీసుకున్నారు. వారు అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా బోవెన్ మంచంపై విగతజీవిగా కనిపించింది. వైద్య పరీక్షల్లో ఆమె మరణానికి మూర్ఛ వ్యాధితో సంబంధం ఉన్న ఆకస్మిక మరణం (Sudden Unexpected Death in Epilepsy – SUDEP) కారణమని తేలింది.
బోవెన్‌కు చాట్‌జీపీటీ లైసెన్స్ లేని వైద్య సలహాలు ఇచ్చిందని, ప్రమాదకరమైన ఆరోగ్య లక్షణాలను సైతం సాధారణమైనవిగా చిత్రీకరించిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి OpenAIపై కోర్టులో కేసు దాఖలు చేశారు. నిర్లక్ష్యం, ఉత్పత్తి రూపకల్పనలో లోపాలు, లైసెన్స్ లేకుండా వైద్య సలహాలు అందించడం వంటి అంశాలను తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. అయితే, బోవెన్ మరణానికి చాట్‌జీపీటీ ఇచ్చిన సూచనలే కారణమా? అనే విషయంపై కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ ఘటనపై OpenAI అధికార ప్రతినిధి డ్రూ పుసాటెరి స్పందించారు. ఇది ఎంతో హృదయవిదారకమైన ఘటన అని, బాధిత కుటుంబానికి తమ సానుభూతి తెలియజేశారు. బోవెన్ అప్పట్లో చాట్‌జీపీటీ పాత వెర్షన్‌ను ఉపయోగించిందనీ, ప్రస్తుతం ఆ వెర్షన్ అందుబాటులో లేదని తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆమె ఉపయోగించిన GPT-4o మోడల్‌ను 2026 ఫిబ్రవరి 13న వినియోగదారుల యాప్ నుంచి తొలగించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త ఏఐ మోడళ్లను అత్యవసర పరిస్థితులను మరింత సమర్థంగా గుర్తించి స్పందించేలా మెరుగుపరిచామని పుసాటెరి వివరించారు. అవసరమైన సమాచారం అందుబాటులో లేనప్పుడు వినియోగదారులను మరిన్ని వివరాలు అడగడం, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు ఇవ్వడం వంటి మార్పులు చేశామని చెప్పారు. హానికరమైన సమాధానాలను నివారించేందుకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్య నిపుణులతో కలిసి మోడళ్ల పనితీరును పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
“చాట్‌జీపీటీ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఆరోగ్య సమాచారాన్ని అర్థం చేసుకోవడం, బీమా సేవలు, సంక్లిష్టమైన వైద్య వ్యవస్థల గురించి తెలుసుకోవడం, వైద్యులను సంప్రదించేందుకు ముందుగానే సిద్ధం కావడం వంటి విషయాల్లో ఏఐ ప్రజలకు సహాయపడగలదని మేం నమ్ముతున్నాం” అని డ్రూ పుసాటెరి తెలిపారు.
మొత్తంగా ఈ ఘటన ఏఐ వినియోగంపై మరోసారి కీలక చర్చకు దారితీసింది. ఆరోగ్య సమస్యల విషయంలో ఏఐ చాట్బాట్లు ఎంతవరకు సలహాలు ఇవ్వాలి? వాటి సూచనలకు ఎలాంటి భద్రతా పరిమితులు ఉండాలి? వైద్యుల సలహా లేకుండా ఏఐ ఇచ్చే సూచనలను అనుసరిస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురుకావచ్చు? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.