
ఇన్స్టాగ్రామ్లో తన ప్రయాణ విశేషాలను ఈ యువతి పంచుకుంటోంది. దేశమంతా తిరిగేందుకు ఆమెకు రూ.10 వేల బడ్జెట్ మాత్రమే ఉంది. చాలామంది ఒక ప్రాంతానికి వెళ్లి రావడానికి రూ.10 వేలు ఖర్చు చేస్తారు. కానీ తాను మాత్రం అదే మొత్తంతో భారతదేశాన్ని చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది . రూ.2 వేలు మాత్రమే ఖర్చు చేసి ఆరు రాష్ట్రాలను సందర్శించింది .
అయితే తన ప్రయాణం ఇంకా చాలా మిగిలి ఉందని, రూ.10 వేలతో దేశమంతా తిరగడం సాధ్యమవుతుందో లేదో తనకే తెలియదని చెప్పింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే తన ఛాలెంజ్ కూడా అక్కడితో ముగుస్తుందని తెలిపింది. చివరకు ఈ సవాలును పూర్తి చేయగలనా? లేదా? అన్నది చూడాలని తన ఫాలోవర్లను కోరుతోంది.
ఇంత తక్కువ బడ్జెట్తో ప్రయాణం ఎలా సాధ్యమవుతుందన్న సందేహం చాలామందికి రావచ్చు. ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు కొంత సమాధానం ఇస్తున్నాయి. ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉచితంగా భోజనం అందించాలని కోరుతోంది. రైళ్లు ఆలస్యమైన సందర్భాల్లో రైల్వే స్టేషన్లలోనే ఉండాల్సి వచ్చిన విషయాలను కూడా వీడియోల్లో పంచుకుంది. ఇలా అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ఈ యువతి ఛాలెంజ్పై సోషల్ మీడియాలో కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు మాత్రం ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ‘జాగ్రత్తగా ఉండు.. నువ్వు చాలా బాగా చేస్తున్నావు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రయాణానికి ఎంచుకునే రవాణా మార్గం, వసతి, ఆహారంపై ఖర్చు ఆధారపడుతుంది. దేవాలయాలు, గురుద్వారాల్లో ఉచిత భోజన సదుపాయాలను ఉపయోగించుకోవాలని, తక్కువ ఖర్చుతో ప్రయాణించే రవాణా మార్గాలను ఎంచుకోవడం, అందుబాటులో ఉన్న చౌకైన వసతుల్లో ఉండటం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చని తెలిపారు. రూ.10 వేలతో దేశమంతా తిరగడం సాధ్యం కాదని మరికొందరు అంటున్నారు. రైలు టికెట్లు, భోజనం, బస ఖర్చులకే ఆ మొత్తం సరిపోదని ఒక యువతి ఒంటరిగా దేశమంతా తిరుగుతున్నప్పుడు భద్రత, రాత్రిపూట బస వంటి ఎలా నిర్వహిస్తుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేవలం రూ.10 వేలతో భారతదేశాన్ని చుట్టేయాలన్న ఈ యువతి ఛాలెంజ్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆరు రాష్ట్రాలు తిరిగేందుకు రూ.2 వేలే ఖర్చు చేసిన ఆమె.. మిగిలిన దేశాన్ని కూడా ఇదే బడ్జెట్లో చూడగలదా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.