
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ టంగులా. టంగులా రైల్వే స్టేషన్ టిబెట్ ప్రాంతంలో ఉంది. ఈ స్టేషన్ సముద్ర మట్టానికి దాదాపు 16600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్టేషన్ కు చేరుకునే కింగ్హై–టిబెట్ రైల్వే లైన్ ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణిస్తారు. ఇకపోతే, భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ డార్జిలింగ్ లోని ఘూమ్. ఈ స్టేషన్ సముద్ర మట్టానికి 2258 మీటర్లు (7407 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రసిద్ధికెక్కింది.
భారతదేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్ ఇది. ఈ స్టేషన్ ఇప్పటికీ దాని అందంతో అందరినీ ఆకర్షిస్తుంది. హిమాలయాల ఒడిలో, మబ్బులు కమ్ముకున్న ప్రకృతి అందాల మధ్య ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చే టాయ్ ట్రైన్ ప్రయాణం మీకు ఒక కలల ప్రయాణంలా ఉంటుంది. చుట్టూ పర్వతాలు, టీ గార్డెన్లు, చల్లని వాతావరణం… అన్నీ కలిసి ఈ స్టేషన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. చలికాలంలో అయితే, గూమ్ స్టేషన్ పూర్తిగా మబ్బుల్లో మునిగిపోతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ప్రకృతి అద్భుతాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు.
100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న గూమ్ రైల్వే స్టేషన్, నేటికీ భారత రైల్వేకు గర్వకారణంగా నిలుస్తోంది. సాంకేతిక పరిమితులు ఉన్న కాలంలోనే ఇంత ఎత్తులో రైల్వే నిర్మించడం నిజంగా ఆశ్చర్యమే. భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్‌గా గూమ్ తన స్థానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంది. ప్రకృతి, చరిత్ర, రైల్వే ప్రయాణం, ఇవన్నీ ఒకేచోట చూడాలంటే గూమ్ స్టేషన్ తప్పక చూడాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..