పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..? మీ ప్రాణాలు కాపాడే ట్రిక్స్ ఇవే..

రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయితే వెంటనే ఏం చేస్తాం? చాలామంది భయంతో ఇంజిన్ ఆఫ్ చేయడం లేదా స్పీడ్‌లో ఉండగానే హ్యాండ్‌బ్రేక్ లాగడం లాంటి పనులు చేస్తారు. కానీ ఆ చిన్న పొరపాట్లే ప్రాణాల మీదకు తెస్తాయని మీకు తెలుసా? నిత్యం రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అత్యవసర రక్షణ సూత్రాలు కొన్ని ఉన్నాయి. పొరపాటున కూడా చేయకూడని ఆ 2 తప్పులు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం..

పొరపాటున బైక్, కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి..? మీ ప్రాణాలు కాపాడే ట్రిక్స్ ఇవే..
What To Do If Brakes Fail While Driving

Updated on: Oct 18, 2026 | 3:37 PM

హైవేపై 80 నుంచి 100 కి.మీ వేగంతో వెళ్తున్నారు.. సడన్‌గా ముందు ఏదో అడ్డంకి వచ్చింది.. బ్రేక్ తొక్కారు.. కానీ బ్రేక్ పడలేదు. ఇలాంటి పరిస్థితి ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. చాలా రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోవడానికి బ్రేకులు ఫెయిల్ అవ్వడం కంటే ఆ భయంలో వారు చేసే చిన్న తప్పిదాలే ప్రధాన కారణం. మరి ఇలాంటి అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనాన్ని సురక్షితంగా ఎలా ఆపాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్న కీలక సూత్రాలు ఇక్కడ ఉన్నాయి.

పొరపాటున కూడా ఈ 2 తప్పులు చేయకండి..

ఇంజిన్ ఆఫ్ చేయవద్దు: కారు ఆగడం లేదని భయంతో చాలామంది చేసే మొదటి తప్పు ఇంజిన్ ఆఫ్ చేయడం లేదా కీ తీసేయడం. అలా చేస్తే వెంటనే స్టీరింగ్ లాక్ అయిపోతుంది. వాహనంపై మీకున్న కొద్దిపాటి నియంత్రణ కూడా పూర్తిగా పోయి, రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టే ప్రమాదం ఉంది.

హైస్పీడ్‌లో హ్యాండ్‌బ్రేక్ లాగవద్దు: కారు 60 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ఉన్నప్పుడు ఒక్కసారిగా హ్యాండ్‌బ్రేక్ లాగితే, వెనుక చక్రాలు లాక్ అయిపోయి కారు అదుపుతప్పి గింగిరాలు తిరుగుతుంది.

కారు బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలి?

స్టెప్ 1: బ్రేక్ పెడల్‌ను వేగంగా పంప్ చేయండి. బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అయినా లేదా ఎయిర్ లాక్ అయినా కొన్నిసార్లు బ్రేక్ పనిచేయదు. అలాంటి సమయంలో బ్రేక్ పెడల్‌ను ఒక్కసారి తొక్కి వదిలేయకుండా, వేగంగా నాలుగైదు సార్లు వరుసగా నొక్కుతూ ఉండండి. దీనివల్ల మిగిలి ఉన్న ప్రెషర్ సహాయంతో బ్రేకులు కొంతమేర పనిచేసే అవకాశం ఉంటుంది.

స్టెప్ 2: ఇంజిన్ బ్రేకింగ్ వాడండి. ఇది వాహనం వేగాన్ని తగ్గించడానికి అత్యంత సురక్షితమైన మార్గం. మీ కారు 5వ గేర్‌లో ఉంటే.. వెంటనే 4వ గేర్‌లోకి, ఆ తర్వాత 3, 2, 1 గేర్లకు క్రమంగా మార్చండి. గేర్ తగ్గేకొద్దీ ఇంజిన్ రెసిస్టెన్స్ వల్ల వాహనం వేగం ఆటోమేటిక్‌గా పడిపోతుంది. ఆటోమేటిక్ కార్లు అయితే గేర్ లీవర్‌ను మ్యాన్యువల్ లేదా స్పోర్ట్స్ మోడ్‌లోకి మార్చి లోయర్ గేర్లకు షిఫ్ట్ చేయాలి.

స్టెప్ 3: హజార్డ్ లైట్లు వేసి, హారన్ కొట్టండి. మీరు ప్రమాదంలో ఉన్నారనే విషయం ఎదురుగా, పక్కన వచ్చే వాహనదారులకు తెలియాలి. వెంటనే డబుల్ ఇండికేటర్లు ఆన్ చేసి, ఎడతెరిపి లేకుండా హారన్ కొడుతూ ఉండండి. దీనివల్ల ఇతరులు మీకు దారి ఇస్తారు.

స్టెప్ 4: వేగం 30 కి.మీ కంటే తగ్గగానే హ్యాండ్‌బ్రేక్ వాడండి. ఇంజిన్ బ్రేకింగ్ ద్వారా వాహనం స్పీడ్ 30 కి.మీ లేదా అంతకంటే తక్కువకు వచ్చిన తర్వాత, హ్యాండ్‌బ్రేక్‌ను నెమ్మదిగా, జాగ్రత్తగా పైకి లాగండి. కారు పూర్తిగా ఆగిపోతుంది.

స్టెప్ 5:  ముందు ఏదైనా పెద్ద లోయ లేదా ప్రమాదకర ప్రాంతం ఉండి వాహనం ఆగకపోతే.. డివైడర్ వైపు లేదా రోడ్డు పక్కన ఉండే మట్టి, ఇసుక, కంకర రాళ్లు లేదా చిన్న పొదల వైపు వాహనం టైర్లను నెమ్మదిగా మళ్లించండి. ఆ రాపిడికి వాహనం వేగం వెంటనే తగ్గుతుంది.

బైక్ బ్రేకులు ఫెయిల్ అయితే ఎలా సేఫ్ అవ్వాలి?

  • యాక్సిలరేటర్ పూర్తిగా వదిలేయండి
  • కారు లాగే బైక్‌లో కూడా ఒక్కో గేర్ డౌన్ చేస్తూ 1వ గేర్‌లోకి రావాలి. ఇంజిన్ స్వయంగా బైక్ వేగాన్ని లాగేస్తుంది.
  • గేర్ మార్చేటప్పుడు మాత్రమే క్లచ్ వాడాలి. గేర్ పడ్డాక క్లచ్‌ను పట్టుకుని ఉంచకూడదు. వదిలేస్తేనే ఇంజిన్ బైక్‌ను ఆపుతుంది.
  • సాధారణంగా ముందు లేదా వెనుక బ్రేకులలో ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది. పని చేస్తున్న రెండో బ్రేక్‌ను సున్నితంగా, విడతల వారీగా అప్లై చేస్తూ బండిని అదుపులోకి తేవాలి.

కీలక సూచన

ఈ టెక్నిక్స్ ప్రాణాలు కాపాడుతాయి కానీ, అసలు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ప్రయాణానికి బయలుదేరే ముందే బ్రేక్ ఆయిల్ స్థాయి, బ్రేక్ ప్యాడ్ల అరుగుదలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవడం మర్చిపోవద్దు.

Loading...
Unable to load recommendations.
Follow Us