
తక్కువ ధరలో, సులభంగా హోటల్ గది బుక్ చేసుకోవాలంటే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చే పేరు OYO. కొత్త నగరాలకు వెళ్లినప్పుడు గదుల కోసం వీధులు పట్టుకుని తిరిగే పనిలేకుండా, స్మార్ట్‌ఫోన్‌లోనే ధరలు, వసతులు, కస్టమర్ రివ్యూలు చూసుకుని నిమిషాల్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఓయో అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, కుటుంబాలతో ప్రయాణించే వారికి ఇది అత్యంత చేరువైన ప్లాట్‌ఫామ్‌గా మారింది. అయితే నిత్యం మనం వాడే OYO అనే పదానికి అసలు పూర్తి రూపం ఏమిటి? దీని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది OYO అనేది కేవలం ఒక బ్రాండ్ పేరు మాత్రమే అని అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక ప్రత్యేకమైన పూర్తి రూపం ఉంది. OYO అంటే ఆన్ యువర్ ఓన్ అని అర్థం. ప్రయాణికులు హోటల్ గదిని బుక్ చేసుకున్నప్పుడు, అది ఏదో బయటి గదిలా కాకుండా తమ సొంత ఇల్లు అనే భావన కలగాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ పేరును ఎంచుకుంది. తనకు నచ్చిన గదిని, తన బడ్జెట్లో ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ వినియోగదారుడికి ఉండాలనేది దీని ప్రధాన ఉద్దేశం. మాతృసంస్థ తన కార్పొరేట్ బ్రాండింగ్‌లో భాగంగా PRISM వంటి కొత్త పేర్లు, విభాగాలను ప్రవేశపెట్టినప్పటికీ, వినియోగదారుల మదిలో మాత్రం OYO బ్రాండ్ చెరగని ముద్ర వేసింది.
యువ భారతీయ పారిశ్రామికవేత్త రితేష్ అగర్వాల్ ఈ సంస్థను స్థాపించారు. టీనేజ్ వయసులోనే దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేసిన ఆయన, బడ్జెట్ హోటళ్లలో కనీస సౌకర్యాలు, శుభ్రత కొరవడటాన్ని గమనించారు. సాంకేతికతను ఉపయోగించి ప్రయాణికులకు సరసమైన ధరల్లో నాణ్యమైన గదులను అందించాలనే లక్ష్యంతో 2012లో ఓరవెల్ స్టేస్ పేరుతో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తన వ్యాపార నమూనాను మరింత మెరుగుపరుచుకుని.. 2013లో దానిని OYO రూమ్స్‌గా మార్చారు.
ఓయో కేవలం ప్రయాణికులకే కాకుండా చిన్న, మధ్యతరహా హోటల్ యజమానులకు కూడా పెద్ద ఊతమిచ్చింది. సరైన మార్కెటింగ్ లేక ఖాళీగా ఉండే హోటళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని, వాటికి ఆన్లైన్ గుర్తింపును కల్పించింది. దీనివల్ల హోటళ్లలో గదులు నిండిపోయే రేటు గణనీయంగా పెరిగింది. కేవలం హోటల్ గదులకే పరిమితం కాకుండా కాలక్రమేణా హాలిడే హోమ్స్, సర్వీస్ అపార్ట్మెంట్లను కూడా తన ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చి, భారత్‌తో పాటు విదేశీ మార్కెట్లలోనూ విస్తరించింది.
సాంకేతికత సాయంతో ఒకే ప్రాంతంలోని వివిధ హోటళ్ల ధరలను పోల్చుకునే వెసులుబాటు ఓయో కల్పిస్తోంది. అయితే అన్ని హోటళ్లలో ఒకే రకమైన సౌకర్యాలు, నిబంధనలు ఉండవు. కాబట్టి గదిని బుక్ చేసుకునే ముందే ఆయా హోటళ్ల చెక్-ఇన్ సమయాలు, గుర్తింపు కార్డుల నిబంధనలు, బుకింగ్ రద్దు విధానం, అదనపు ఛార్జీల వివరాలను పూర్తిగా సరిచూసుకోవడం ప్రయాణికులకు ఎంతో మంచిది.