Viral Video: వీళ్లది మామూలు ఫ్యామిలీ కాదు సామీ.. విమానాన్ని హోటల్‌గా మార్చేశారు.. వీడియో చూస్తే..

గాల్లో ఎగిరే విమానాన్ని చూసి జనరల్ బోగీ అనుకున్నారో ఏమో.. డబ్బాలు తెరిచారు, డోక్లా, తేప్లాలు బయటకు తీశారు.. ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లి అందరికీ ప్లేట్లలో వడ్డించేసింది. ఇండిగో ఫ్లైట్‌లో ఒక పెద్ద కుటుంబం చేసిన ఫుడ్ హంగామా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రైలు ప్రయాణాన్ని తలపించేలా సాగిన ఈ విమాన విందు..నెట్టింట పెను దుమారాన్నే రేపింది.

Viral Video: వీళ్లది మామూలు ఫ్యామిలీ కాదు సామీ.. విమానాన్ని హోటల్‌గా మార్చేశారు.. వీడియో చూస్తే..
Passengers Eating Home Food On Indigo Flight

Updated on: Aug 27, 2026 | 12:37 PM

సాధారణంగా భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు పక్క సీట్ల వారితో కబుర్లు చెప్పుకుంటూ, ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ పంచుకుంటూ సందడిగా వెళ్లడం సర్వసాధారణం. అయితే సరిగ్గా ఇలాంటి సీన్ ఒకటి ఏకంగా గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో కనిపించడంతో ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఇండిగో విమానంలో ఓ పెద్ద కుటుంబం చేసిన హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు 15 మంది సభ్యులున్న ఒక ఉత్తరాది కుటుంబం ఇండిగో విమానంలో ప్రయాణిస్తుంది. వారు ఫ్లైట్ ఎక్కేటప్పుడే భారీ ఎత్తున ఇంటి నుంచి ఆహారం తెచ్చుకున్నారు. సీట్లలో కూర్చున్న తర్వాత డబ్బాలో నుంచి డోక్లా, తేప్లా వంటి రకరకాల గుజరాతీ, ఉత్తరాది స్నాక్స్ బయటకు తీసి, అక్కడికక్కడే అందరికీ ప్లేట్లలో వడ్డించడం మొదలుపెట్టారు. ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తూ కుటుంబ సభ్యులందరికీ ప్లేట్లను పంచుతుండటం, అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ సందడి చేయడం కనిపించింది. వాడిన డిస్పోజబుల్ ప్లేట్లను వేయడానికి ఒక పెద్ద చెత్త బ్యాగ్‌ను కూడా వారు ముందుగానే సిద్ధం చేసుకుని తెచ్చుకోవడం గమనార్హం. ఈ తతంగాన్ని వీడియో తీసిన ఓ ప్రయాణికుడు దేశీ ఫ్యామిలీస్ ట్రావెలింగ్ కోర్ అంటూ క్యాప్షన్ ఇచ్చి నెట్టింట పోస్ట్ చేశాడు.

ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. విమానంలో ఇలా హల్‌చల్ చేయడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం నడుస్తున్న సమయంలో అటూఇటూ తిరుగుతూ ప్లేట్లు పంచడం వల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని, ఘాటైన ఆహారపు వాసనలు ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ మొత్తం వ్యాపించి ఇబ్బంది కలిగిస్తాయని మండిపడుతున్నారు. కొందరైతే భారతీయుల్లో సివిక్ సెన్స్ లోపిస్తోంది.. ఇలాంటి వారిని ఏడాది పాటు నో ఫ్లై లిస్ట్‌లో పెట్టాలి అంటూ ఘాటుగా కామెంట్లు చేశారు.

మరోవైపు ఆ కుటుంబానికి మద్దతుగా కూడా పలువురు నెటిజన్లు నిలిచారు. విమాన ప్రయాణాల్లో ప్రయాణికులు సొంతంగా ఇంటి ఆహారాన్ని తెచ్చుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవని, నిబంధనలను వాళ్లు ఉల్లంఘించలేదని గుర్తుచేశారు. వాడిన తర్వాత చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రత్యేక బ్యాగ్‌లో సేకరిస్తూ పరిశుభ్రతను పాటించారని అన్నారు. ఎయిర్‌లైన్స్ వారు అందించే ఆహారానికి లేని వాసన సమస్య, ఇంటి తిండికే ఎందుకు వస్తుందంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా విమానంలో ఈ ఫ్యామిలీ ఫుడ్ పార్టీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us