విమానాశ్రయమే ఇల్లు, వచ్చిపోయేవాళ్లే బంధువులు..! 18ఏళ్లు గడిపిన వ్యక్తి .. వింతైన యదార్థ గాథ!

సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులు విమానం ఎక్కే వరకు లేదా ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చే వరకు కొన్ని గంటల పాటు అక్కడ గడుపుతారు. కానీ ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి ఏకంగా 18 సంవత్సరాల పాటు విమానాశ్రయాన్నే తన శాశ్వత చిరునామాగా మార్చుకున్నాడు. వినడానికి ఏదో సినిమా కథలా అనిపించినా, ఇది అక్షరాలా నిజం. ప్రపంచవ్యాప్తంగా సిర్ ఆల్ఫ్రెడ్ గా ప్రసిద్ధి చెందిన మెహ్రాన్ కరీమి నస్సేరి (Mehran Karimi Nasseri) జీవిత విశేషాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

విమానాశ్రయమే ఇల్లు, వచ్చిపోయేవాళ్లే బంధువులు..! 18ఏళ్లు గడిపిన వ్యక్తి .. వింతైన యదార్థ గాథ!
Mehran Karimi Nasseri

Updated on: Jul 01, 2026 | 11:53 AM

ఎయిర్‌పోర్ట్ అంటే ప్రయాణికులు కొన్ని గంటల పాటు గడిపే స్థలం. కానీ, ఒక వ్యక్తి ఏకంగా 18 ఏళ్ల పాటు ఎయిర్‌పోర్ట్‌నే తన శాశ్వత నివాసంగా మార్చుకున్నాడంటే నమ్మగలరా? కానీ, ఇది నిజం..ఇరాన్ దేశానికి చెందిన మెహ్రాన్ అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. శరణార్థిగా యూరప్ దేశాల్లో ఆశ్రయం కోసం తిరుగుతూ, చివరికి ఇంగ్లాండ్ వెళ్లేందుకు ఫ్రాన్స్‌లోని ప్యారిస్ చార్లెస్ డి గల్లె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ ప్రయాణంలో అతని పాస్‌పోర్ట్, శరణార్థి పత్రాలు దొంగిలించబడ్డాయి. ఆధారాలు లేకపోవడంతో బ్రిటన్ అధికారులు అతడిని దేశంలోకి రానివ్వలేదు. మరోవైపు ఫ్రాన్స్ దేశంలోకి ప్రవేశించడానికి కూడా చట్టబద్ధమైన పత్రాలు లేవు. దీంతో అతడు ఎయిర్‌పోర్ట్ అంతర్జాతీయ ట్రాన్సిట్ జోన్ (టెర్మినల్-1) లోనే చిక్కుకుపోయాడు.

ఎయిర్‌పోర్ట్ బెంచే అతని ప్రపంచం:

1988లో ప్రారంభమైన ఈ విచిత్ర జీవితం ఏకంగా 18 ఏళ్ల పాటు కొనసాగింది. టెర్మినల్-1 లోని ఒక ఎర్రటి బెంచే అతనికి ఇల్లుగా మారింది. తన బట్టలు, పుస్తకాలు, పెట్టెలను అక్కడే సర్దుకుని జీవించేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే పబ్లిక్ టాయిలెట్లలో నిత్యకృత్యాలు ముగించడం, దినపత్రికలు చదవడం, రేడియో వినడం, తన జీవిత అనుభవాలను డైరీలో రాయడం అతని దినచర్య. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, పైలట్లు అతనికి అలవాటైపోయి, ప్రేమతో సిర్ ఆల్ఫ్రెడ్ అని పిలిచేవారు. వారు అందించే ఆహారం, పుస్తకాలతోనే కాలం వెళ్లదీశాడు.

చట్టపరమైన అనుమతులు వచ్చినా వెళ్లలేదు:

1999లో ఫ్రాన్స్, బెల్జియం ప్రభుత్వాలు అతనికి నివాస పత్రాలు మంజూరు చేశాయి. కానీ ,11 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్ జీవితానికి అలవాటుపడిన మెహ్రాన్, బయటి ప్రపంచంపై భయంతో ఆ పత్రాలపై సంతకం చేయడానికి నిరాకరించి, మరో 7 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు.

ఇవి కూడా చదవండి

హాలీవుడ్ సినిమా ది టెర్మినల్:

మెహ్రాన్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్, నటుడు టామ్ హాంక్స్ కాంబినేషన్‌లో 2004లో The Terminal అనే అద్భుతమైన సినిమాను తీశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. దీని ద్వారా వచ్చిన రాయల్టీ డబ్బుతో 2006లో అతను ఎయిర్‌పోర్ట్ విడిచి ప్యారిస్‌లోని ఒక హోటల్‌లో నివసించడం ప్రారంభించాడు. అయితే, ఎయిర్‌పోర్ట్‌పై ఉన్న విడదీయరాని బంధంతో, తన చివరి రోజుల్లో 2022లో మళ్లీ అదే చార్లెస్ డి గల్లె ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వచ్చి, అక్కడే తన 76వ ఏట కన్నుమూశాడు. పౌరసత్వం, చట్టాలు, మానవ అనుబంధాలకు ప్రతీకగా నిలిచిన సిర్ ఆల్ఫ్రెడ్ కథ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us