నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..!

తల్లిదండ్రులపై ప్రేమను చాటుకోవడానికి, వారి కష్టాన్ని తగ్గించడానికి కుమారులు చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ఒక యువ రైతు తన 70 ఏళ్ల తండ్రి పడుతున్న శ్రమను చూడలేక చేసిన ఒక వినూత్న ప్రయోగం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 55 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుకు చుట్టూ గుండ్రటి ఇనుప మెట్లు నిర్మించి, తన తండ్రి ఎంతో సురక్షితంగా పైకి ఎక్కేలా చేసి వార్తల్లో నిలిచారు.

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..55 అడుగుల ఎత్తు హాయిగా ఎక్కిదిగేయొచ్చు..!
Palm Tree Innovation

Updated on: Jul 22, 2026 | 3:26 PM

చాలా మంది తమ జీవనోపాధి కోసం ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. కొందరు ప్రతిరోజూ కొన్ని అడుగుల ఎత్తైన చెట్లను కూడా ఎక్కవలసి ఉంటుంది. అలాంటి వారికి ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుంది. కానీ, తమ కుటుంబాలు, జీవనోపాధి కోసం ప్రజలు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటారు. అటువంటి ఒక కథను వివరించే హృద్యమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అందులో ఒక రైతు కొడుకు తన 70 ఏళ్ల తండ్రి కోసం ఎంతో ప్రత్యేకమైన పని చేశాడు, దానికి ప్రజలు అతడిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

తాటిచెట్టు ఎక్కడమే ఒక పెద్ద సవాలు!:

తూత్తుకుడి జిల్లా సలైపుదూర్ గ్రామానికి చెందిన దినకరరాజ్ (35) కుటుంబానికి తరతరాల నుంచి తాటికల్లు, నీరా (కల్లు) సేకరణే ప్రధాన జీవనాధారం. ఆయన తండ్రి యేసుదాసన్ (70) దశాబ్దాలుగా రోజుకు రెండు, మూడు సార్లు తాటిచెట్లు ఎక్కుతూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే, వయసు పైబడటం, చెట్టు కాండం బాగా లావుగా మారి జారేలా ఉండటంతో 55 అడుగుల ఎత్తు ఉన్న ఆ చెట్టు ఎక్కడం చాలా ప్రమాదకరంగా మారింది. మరోవైపు గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కే నైపుణ్యం ఉన్న కల్లు గీత కార్మికుల కొరత కూడా తీవ్రంగా వేధించడం మొదలైంది.

ఇవి కూడా చదవండి

రూ. 60 వేల ఖర్చుతో రూపుదిద్దుకున్న స్పైరల్ మెట్లు:

తండ్రి కష్టాన్ని చూసిన దినకరరాజ్ ఈ సమస్యకు ఒక సులువైన పరిష్కారాన్ని ఆలోచించారు. చెట్టు చుట్టూ గాల్వనైజ్డ్ ఇనుప పైపులతో స్పైరల్ మెట్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్మాణంలో చెట్టుకు ఎటువంటి హానీ కలగకుండా ఒక్క మేకు కూడా కొట్టకపోవడం విశేషం. కేవలం మెటల్ బెల్టులతో చెట్టు చుట్టూ 48 మెట్లను బిగించారు. సుమారు 220 నుండి 250 కిలోల ఇనుమును ఉపయోగించి, ఐదు రోజుల్లో రూ. 60,000 ఖర్చుతో ఈ మెట్ల మార్గాన్ని సిద్ధం చేశారు.

ఆర్థికంగానూ ఎంతో ప్రయోజనకరం:

ఈ ప్రత్యేకమైన తాటిచెట్టు సీజన్లో ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని ఇస్తుందని దినకరరాజ్ తెలిపారు. అందువల్ల మెట్లకు పెట్టిన పెట్టుబడి ఒకే సంవత్సరంలో తిరిగి వస్తుందని, ఈ నిర్మాణం మరో 15 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తండ్రియే కాకుండా, ఇంట్లోని ఇతరులు కూడా ఎలాంటి భయం లేకుండా సులభంగా చెట్టు పైకి వెళ్లి నీరా సేకరించగలుగుతున్నారు.

తాతముత్తాతల నాటి సంప్రదాయ వృత్తిని కాపాడుకుంటూనే, సమయానుకూల ఆలోచనతో ప్రమాదాలను తగ్గించిన ఈ తమిళనాడు రైతు ప్రయోగం గ్రామీణ ప్రాంతాల్లో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us