Video: నిద్రమత్తులో డ్రైవర్.. పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కారు!

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. డ్రైవింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు తప్పవని మరో ఘటన నిరూపించింది. టెస్లా కారులోని సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసి ఓ వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు. అదుపు తప్పిన కారు పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో ఈ ఘటన జరిగింది.

Video: నిద్రమత్తులో డ్రైవర్.. పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కారు!
Sleeping Driver Using Tesla Self Driving Mode Crashes Into Police Car

Updated on: Oct 17, 2026 | 9:25 PM

కాలిఫోర్నియా రాష్ట్రం ఫెయిర్‌ఫీల్డ్ సమీపంలోని హైవేపై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఆ హైవేపై అంతకుముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. దీంతో కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ పోలీసులు (CHP) అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో హైవేపై కొన్ని లేన్లను మూసివేశారు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు రోడ్డుపై హెచ్చరిక లైట్లు, ట్రాఫిక్ కోన్లు, మండుతున్న ఫ్లేర్లను ఏర్పాటు చేశారు. పోలీసు వాహనంపై కూడా అత్యవసర లైట్లు వెలుగుతున్నాయి.

అయినప్పటికీ, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో వస్తున్న టెస్లా కారు మూసివేసిన ప్రాంతంలోకి ప్రవేశించింది. వేగంగా దూసుకొచ్చి పోలీసు పెట్రోలింగ్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనంలో ఉన్న ఇద్దరు పోలీసులు ప్రమాద తీవ్రతకు గాయపడ్డారు.

కారులో నిద్రపోయిన 22 ఏళ్ల యువకుడు

ప్రమాద సమయంలో శాక్రమెంటోకు చెందిన 22 ఏళ్ల యువకుడు కారును నడుపుతున్నాడు.  టెస్లాలోని ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (Full Self-Driving) మోడ్‌ను ఆన్‌ చేసి తాను నిద్రపోయానని పోలీసులకు చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన ఇద్దరు పోలీసు అధికారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరునాడు ఆసుపత్రి డిశ్చార్జ్ చేసారు.

డ్యాష్‌ క్యామ్‌లో రికార్డైన ప్రమాద దృశ్యాలు

ఈ ప్రమాదానికి సంబంధించిన డ్యాష్‌క్యామ్ దృశ్యాలను కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ విభాగం విడుదల చేసింది. అందులో టెస్లా కారు వేగంగా వచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో రోడ్డు మూసివేసినట్లు సూచించే హెచ్చరికలు, అత్యవసర లైట్లు ఏర్పాటు చేసినప్పటికీ కారు ఆగలేదు. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయని డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంది.

కారు పూర్తిగా ఆటోమేటిక్‌గా నడుస్తుందా?

టెస్లా కార్లలోని ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ గురించి విన్నప్పుడు డ్రైవర్ అవసరం లేకుండానే కారు ప్రయాణిస్తుందని అనుకుంటాం. కానీ వాస్తవానికి ఈ ఫీచర్ పూర్తిస్థాయి స్వయంచాలక డ్రైవింగ్ వ్యవస్థ కాదు. ఇది డ్రైవర్‌కు సహాయపడే సాంకేతిక ఫీచర్ మాత్రమే. ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నప్పటికీ డ్రైవర్ రోడ్డుపై పరిస్థితులను నిరంతరం గమనించాలి. అవసరమైనప్పుడు వెంటనే వాహనాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కారు స్వయంగా నడుస్తోందనే కారణంతో నిద్రపోవడం లేదా రోడ్డుపై దృష్టి పెట్టకుండా ఉండటం ప్రమాదకరం. అధునాతన సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.  ఈ ప్రమాదానికి బాధ్యత  పూర్తిగా డ్రైవర్‌దే అంటూ హైవే పెట్రోలింగ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. .

Loading...
Unable to load recommendations.
Follow Us