
మన లోగిళ్లలో పెళ్లి వేడుక కేవలం రెండు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల వేడుకగా, పండుగలా నిర్వహిస్తారు. కొందరు జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరికొందరు తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా సాదాసీదాగా పెళ్లి చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెళ్లి ఖర్చులపై కొత్త చర్చకు దారితీసింది. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో, రూ.20 లక్షల పెళ్లి బడ్జెట్ కేవలం రెండు రోజుల్లో ఎలా పూర్తిగా ఖర్చవుతుందో వివరించారు. ఆమె తెలిపిన లెక్కల ప్రకారం, పెళ్లి వేడుకలోని ప్రతి అంశం భారీ వ్యయానికి కారణమవుతోంది.
ఇలా మొత్తంగా రూ.20 లక్షలు కేవలం 24 గంటల్లోనే ఖర్చవుతున్నాయని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టులో ఆమె ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. పెళ్లి విందు కొన్ని గంటలే కొనసాగుతుంది. డీజే కార్యక్రమం నాలుగు గంటలకే పరిమితం అవుతుంది. అలంకరణ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఫోటోలు కొన్ని ఆల్బమ్‌లుగా మాత్రమే మిగులుతాయి. పెళ్లి వేదికను మరుసటి ఉదయానికే నిర్వాహకులకు తిరిగి అప్పగించాల్సి వస్తుంది. అయితే వీటన్నింటికీ కలిపి లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆమె వివరించారు. ‘అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి. వేడుక జరుపుకోండి.. కానీ అప్పుల్లో పడొద్దు..’ అని చెప్పన మీనల్ గోయల్ తాను పెళ్లి వేడుకలను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అయితే తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేయకుండా వివాహాన్ని జరుపుకోవాలని ఆమె సూచించారు. ‘పెళ్లి ఒక వేడుక. అది ఆర్థిక భారంగా మారకూడదు. మీ స్థోమతకు తగ్గట్టుగా వేడుకను జరుపుకోండి. అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోండి. ఆర్థిక ఒత్తిడితో కాకుండా, ఆర్థిక ప్రశాంతతతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించండి. ఒకరోజు పెళ్లికంటే జీవితాంతం నిలిచే వైవాహిక బంధాన్ని నిర్మించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండని’ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
ఇక మీనల్ గోయల్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లిళ్లలో అవసరానికి మించి ఖర్చు చేయాలా? లేక ఆ డబ్బును భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేసుకోవాలా? అనే అంశంపై నెటిజన్లు చర్చోపచర్చలు చేస్తున్నారు. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుక కావడంతో ఖర్చు చేయడంలో తప్పేమీ లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఇంతకీ మీ పెళ్లి వేడుకకు ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో చెప్పనేలేదు. కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయం చెప్పండి..