అమెరికా ఎన్నికల్లో మనోళ్ల సత్తా.. 30 మందికి పైగా విజయం.. కీలక పదవులపై గురి!

అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు భారీ విజయాలు సాధించారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 30 మందికి పైగా భారతీయ అమెరికన్లు రాష్ట్ర శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. వీరిలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం విశేషం. మరోవైపు మిషిగన్, అరిజోనా రాష్ట్రాల్లో కీలక శాసనసభ పదవులను కూడా భారత సంతతి నేతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఎన్నికల్లో మనోళ్ల సత్తా.. 30 మందికి పైగా విజయం.. కీలక పదవులపై గురి!
Over 30 Indian Americans Win State Legislative Seats Across Usa

Updated on: Nov 05, 2026 | 4:42 PM

మంగళవారం జరిగిన అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ డెమొక్రాట్లు గణనీయమైన విజయాలు సాధించారు. మొత్తం 41 మంది భారతీయ అమెరికన్ అభ్యర్థులు రాష్ట్ర శాసనసభ స్థానాలకు పోటీ చేయగా ఇప్పటివరకు 30 మంది విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొమ్మిది మంది ఓటమి పాలయ్యారు. గెలిచిన వారిలో 28 మంది డెమొక్రాట్లు కాగా ఇద్దరు రిపబ్లికన్లు ఉన్నారు.

మిషిగన్‌లో తొలి భారతీయ అమెరికన్ సిక్కు స్పీకర్

మిషిగన్ రాష్ట్రంలో రంజీవ్ పురి మరోసారి ఘన విజయం సాధించారు. 24వ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సుమారు 66 శాతం ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు మిషిగన్ ప్రతినిధుల సభలో తిరిగి మెజారిటీ సాధించారు. దీంతో రంజీవ్ పురికి కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ మైనారిటీ లీడర్‌గా ఉన్న రంజీవ్ పురి.. డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు ఎన్నుకుంటే మిషిగన్ హౌస్ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదే జరిగితే ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయ అమెరికన్, తొలి సిక్కు అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టిస్తారు.

అరిజోనాలోనూ భారతీయ మహిళకు కీలక పదవి

అరిజోనా రాష్ట్రంలో ప్రియా సుందరేశన్ మరోసారి విజయం సాధించారు. 18వ నియోజకవర్గం నుంచి సుమారు 66 శాతం ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు అరిజోనా రాష్ట్ర సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ మెజారిటీ సాధించారు. దీంతో దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రంలో డెమొక్రాట్లకు పూర్తి ఆధిపత్యం లభించింది. ప్రియా సుందరేశన్ ప్రస్తుతం సెనేట్ మైనారిటీ లీడర్‌గా ఉన్నారు. త్వరలో ఆమె సెనేట్ ప్రెసిడెంట్ లేదా మెజారిటీ లీడర్ వంటి కీలక పదవుల్లో ఒకదాన్ని చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పార్టీ సభ్యుల నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జ్యోత్ సింగ్, పూజా సేతి చారిత్రక విజయం

జార్జియాలో జ్యోత్ సింగ్ 97వ హౌస్ నియోజకవర్గం నుంచి సుమారు 68 శాతం ఓట్లతో విజయం సాధించారు. దీంతో జార్జియా రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్, తొలి సిక్కు అమెరికన్‌గా ఆయన గుర్తింపు పొందారు.
టెక్సాస్‌లో పూజా సేతి 47వ హౌస్ నియోజకవర్గం నుంచి సుమారు 63 శాతం ఓట్లతో గెలిచారు. టెక్సాస్ శాసనసభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా, తొలి ఆసియా అమెరికన్ డెమొక్రటిక్ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

పలువురు భారతీయ అమెరికన్లు ఘన విజయం

ఇల్లినాయిస్‌లో నబీలా సయ్యద్ రిపబ్లికన్ అభ్యర్థిపై విజయం సాధించి సెనేట్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. లిసా కౌల్ న్యూయార్క్‌లో రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించి సెనేట్‌కు ఎన్నికయ్యారు. అయోవాలో నిఖిల్ వాగ్లే స్వల్ప ఆధిక్యంలో కొనసాగారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సెనేటర్లు కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇల్లినాయిస్‌లో రామ్ విల్లివాలం, కెవిన్ ఒలికల్, సబా హైదర్ విజయం సాధించారు. నార్త్ కరోలినాలో జయ్ చౌదరి, పెన్సిల్వేనియాలో అరవింద్ వెంకట్, ఒహయోలో అనితా సోమాని, కనెక్టికట్‌లో సుజాత గడ్కర్-విల్కాక్స్, న్యూయార్క్‌లో జెరెమీ కూనీ, విస్కాన్సిన్‌లో రేణుక మాయదేవ్ కూడా గెలుపొందారు. కాలిఫోర్నియాలో అశ్ కల్రా, వాషింగ్టన్‌లో మంకా ధింగ్రా భారీ మెజారిటీతో విజయం సాధించారు. వీరితో పాటు మేగన్ శ్రీనివాస్, నిమా కులకర్ణి, రూబెన్ డిసిల్వా, రీనా స్జెపాన్స్కీ, వందనా స్లాటర్ వంటి అభ్యర్థులు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు.

మహిళలదే పైచేయి.. 15 మంది విజేతలు

ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ మహిళలు కూడా తమ సత్తా చాటారు. మొత్తం 30 మంది విజేతల్లో 15 మంది మహిళలే ఉండటం విశేషం. ఎనిమిది మంది అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఇల్లినాయిస్‌లో అత్యధికంగా నలుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. న్యూయార్క్‌లో ముగ్గురు, వాషింగ్టన్, వెర్మాంట్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున గెలిచారు.

అరుణా మిల్లర్‌ మరోసారి విజయం

రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు ఇతర కీలక పదవులకు జరిగిన పోటీల్లోనూ భారతీయ సంతతి నేతలు విజయాలు సాధించారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్.. గవర్నర్ వెస్ మూర్‌తో కలిసి మరోసారి విజయం సాధించారు. వీరి కూటమికి సుమారు 63 శాతం ఓట్లు వచ్చాయి. విస్కాన్సిన్ అటార్నీ జనరల్ జోష్ కౌల్ కూడా మూడోసారి విజయం సాధించారు. మరోవైపు ఒహయో గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేసిన వివేక్ రామస్వామి ఓటమి పాలయ్యారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసిన సరిత కొమటిరెడ్డి కూడా ఓడిపోయారు.

మొత్తంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర శాసనసభల్లోనే కాకుండా స్థానిక సంస్థలు, కీలక ప్రభుత్వ పదవుల్లోనూ భారతీయ మూలాలున్న నేతలు తమదైన ముద్ర వేస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాలు అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రభావం పెరుగుతోందనడానికి ఉదాహరణగా నిలిచాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us