ఒక వ్యక్తి జీవితంలో బంధాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకునేది, తోడుగా నిలిచేది మన కుటుంబ సభ్యులు మాత్రమే. బయటకు చాలామంది మన కోసం ఏమైనా చేస్తామని కలరింగ్ ఇస్తారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది మన కోసం నిలబడేది ఎవరో. అయితే కుటుంబ బంధాలకు సంబంధించి తాజాగా ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలో నివశించే ఒక వ్యక్తి స్వయంగా చెప్పిన తన స్టోరీ తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇంతకాలం తన అక్కగా భావిస్తున్న మహిళ తనకు జన్మనిచ్చిన తల్లి అని తెలిసి అతడు కంగుతిన్నాడు. చిన్న, చిన్న విషయాల గురించి చిన్న పిల్లాడిలాగా రోజూ తాను గొడవ పడుతున్నది తన పెద్ద సోదరితో కాదు.. తన తల్లితో అని తెలిసిన వెంటనే నిర్ఘాంతపోయాడు.
షామ్ గ్రిఫ్స్ అనే వ్యక్తి టిక్‌టాక్ ద్వారా తన లైఫ్ లో జరిగిన ఈ వింత విషయాన్ని వెల్లడించాడు. తన తల్లి చిన్న వయస్సులోనే గర్భవతి అయిందని, అయినప్పటికీ అబార్షన్ చేయించుకోకుండా తనకు జన్మనిచ్చిందని తెలిపాడు. తన బిడ్డ పుట్టుక గురించి ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే.. సమాధానం ఇవ్వడానికి కూడా ఆమె సిద్ధంగా ఉందని వెల్లడించాడు. కుటుంబ సభ్యులందరూ కలిసి తన మనసు గాయపడుతుందని ఈ నిజాన్ని దాచారని, పెద్దవాడయ్యే వరకు దాని గురించి చెప్పలేదని షామ్ చెప్పాడు. అయితే, నిజం తెలిసిన తరువాత కూడా తాను ఎప్పుడూ ఏ ప్రశ్న లేవనెత్తలేదని తెలిపాడు. ఈ వాస్తవం తెలుసుకున్న తరువాత కూడా తమ మధ్య ప్రేమ తగ్గలేదని, ఇంకా ఎక్కువైందని చెప్పుకొచ్చాడు.
Also Read:‘రంగమార్తాండ’ గురించి కీలక అప్డేట్.. అనుమానాలు పటాపంచలు చేసిన క్రియేటివ్ డైరెక్టర్