
జంతు సామ్రాజ్యంలో అడవికి రారాజుగా ఏలే సింహం తన అపారమైన శారీరక బలం, గర్జనతో శత్రువులను వణికిస్తే.. సరీసృపాల ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తన ఒక్క కాటుతో ప్రాణాలు తీసే భయంకరమైన విషంతో విరుచుకుపడుతుంది. ఒకవేళ ఊహించని విధంగా ఈ రెండు అత్యంత భయానక జీవులు ముఖాముఖి తలపడాల్సి వస్తే ఏమవుతుంది? క్రూర మృగాల రాజైన సింహం తన పదునైన పంజాతో కోబ్రాను మట్టికరిపిస్తుందా? లేక ఏనుగును సహితం సెకన్ల వ్యవధిలో చంపగలిగే విషమున్న కింగ్ కోబ్రా సింహాన్ని కాటువేసి గెలుస్తుందా? అసలు ఈ రెండింటి మధ్య పోరు సాగితే అంతిమంగా విజయం ఎవరిని వరిస్తుంది? ఈ రెండు ప్రాణాంతక జీవుల బలాబలాలు, దాడి చేసే నైపుణ్యాలు, పోరు ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సింహం: పెంపకంలో ఉన్న సింహం సుమారు 190 నుండి 250 కేజీల వరకు బరువు ఉంటుంది. ఇవి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. పదునైన గోళ్లు, బలమైన దవడలతో శత్రువును క్షణాల్లో చీల్చిచెండాడే శక్తి దీని సొంతం.
కింగ్ కోబ్రా: ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం. ఇది సుమారు 10 నుండి 18 అడుగుల పొడవు, 6 నుండి 10 కేజీల బరువు ఉంటుంది. తన శరీరంలో మూడో వంతు భాగాన్ని గాలిలోకి లేపి శత్రువును భయపెట్టగలదు.
పోలిక: శారీరక బలం, బరువు విషయంలో సింహానిదే పైచేయి.
సింహం: సింహం వేగంగా దాడి చేస్తుంది. దాని పదునైన పంజాతో కొట్టినా లేదా దవడలతో పట్టుకున్నా ప్రత్యర్థి కోలుకోవడం కష్టం.
కింగ్ కోబ్రా: కింగ్ కోబ్రా దాడి చేసే వేగం అత్యంత ప్రమాదకరం. శత్రువు ఊహించని వేగంతో ముందుకు ఉరికి కాటు వేస్తుంది. దీని విజన్ చాలా పదునైనది.
కింగ్ కోబ్రా వద్ద ఉన్న అతిపెద్ద ఆయుధం దాని విషం. కింగ్ కోబ్రా ఒక్కసారి కాటు వేస్తే విడుదల చేసే విషంతో ఒక పెద్ద ఏనుగును గానీ, లేదా 20 మంది మనుషులను గానీ చంపవచ్చు. దీని విషం ప్రత్యర్థి నాడీ వ్యవస్థపై తక్షణమే ప్రభావం చూపి.. గుండె, శ్వాసకోశ వ్యవస్థను నిలిపివేస్తుంది. సింహానికి పాము విషాన్ని తట్టుకునే ఎలాంటి సహజ రోగనిరోధక శక్తిలేదు.
ఈ రెండు జీవుల ఆవాసాలు వేర్వేరు అయినప్పటికీ, ఒకవేళ వీటి మధ్య పోరు జరిగితే ఫలితం ఇలా ఉండే అవకాశం ఉంది..
సింహానికి గెలిచే అవకాశం: సింహం తన పదునైన పంజాతో కోబ్రా తలపై ఒక్క దెబ్బ కొట్టినా లేదా దాని తలను దవడలతో నలిపివేసినా కింగ్ కోబ్రా అక్కడికక్కడే చనిపోతుంది.
కింగ్ కోబ్రాకు గెలిచే అవకాశం: కోబ్రా కనుక సింహానికి ఒక్కసారి సరిగ్గా కాటు వేసి విషాన్ని శరీరంలోకి పంపితే కొన్ని నిమిషాల్లోనే సింహం ప్రాణాలు కోల్పోతుంది.
ఈ పోరులో సింహానికే గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సింహం పరిమాణంలో చాలా పెద్దది. దాని స్పందించే వేగం చాలా చురుగ్గా ఉంటాయి. కానీ సింహం కోబ్రాను చంపినప్పటికీ.. ఆ పోరాటంలో కోబ్రా గనుక సింహాన్ని కాటు వేసి ఉంటే.. కోబ్రా చనిపోయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సింహం కూడా ఆ విషానికి బలైపోతుంది. అంటే ఈ యుద్ధంలో ఒకరిది తాత్కాలిక విజయమైతే, అంతిమంగా ఇద్దరి ప్రాణాలు పోయే ప్రమాదమే ఎక్కువ.