
ఈ ప్రమాదంలో నౌకలోని మొత్తం 21 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ తెలిపింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు ఈ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. అక్టోబర్ 6న గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్‌కు సంబంధించిన నౌకపై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఆ నౌక అమెరికా నౌకలపై నిఘా పెట్టిందనీ దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆరోపించింది. మరో ఘటనలో ఆంటిగ్వా అండ్ బార్బుడా జెండాతో ప్రయాణిస్తున్న Cape Dao అనే భారీ నౌక కూడా హార్ముజ్ జలసంధిలో మునిగిపోయింది. సెప్టెంబర్ 23న సముద్ర మైన్ ను ఢీకొట్టిన ఈ నౌక కొన్ని వారాల తర్వాత సముద్రంలో మునిగింది. ఈ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలను పరిమితం చేస్తూ, జలసంధిపై తన నియంత్రణను పెంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. గత 48 గంటల్లో ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిపింది. గత పది రోజులుగా వాణిజ్య నౌకలపై దాడులు పెంచింది.
అమెరికా తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధం, కఠినతరం చేసిన ఆంక్షలకు ప్రతిస్పందనగా దాడులు పెంచిన్నట్లు ఇరాన్ చెబుతోంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా అయ్యేది. ఈ మార్గంలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రపంచ ఇంధన సరఫరా, చమురు ధరలపై ప్రభావం పడింది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేసాయి. సముద్రంలో తేలుతున్న ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిళ్లు ఈ విషయాన్నే మరోసారి గుర్తుచేసాయి.