అమెరికాలో భారతీయ సినీ దర్శకుడు అరెస్ట్.. వారెంట్‌ లేకుండా అదుపులోకి తీసుకున్న ICE

కశ్మీరీ సినీ దర్శకుడు అరాఫత్ షేక్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 24న వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్‌లో వారెంట్ చూపించకుండా అరెస్ట్ చేశారనీ ఆయన విడుదల కోసం ప్రయత్నిస్తున్న ప్రచార క్యాంపెయిన్ సంస్థ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అరాఫత్ షేక్ ‘Saffron Kingdom’ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అమెరికాలో భారతీయ సినీ దర్శకుడు అరెస్ట్.. వారెంట్‌ లేకుండా అదుపులోకి తీసుకున్న ICE
Indian Filmmaker Arfat Sheikh Detained By Ice Agents At Us Airport

Updated on: Oct 07, 2026 | 9:22 PM

సెప్టెంబర్ 24న వాషింగ్టన్‌ లోని డల్లెస్ ఎయిర్‌పోర్ట్‌లో అరాఫత్ విమానం నుంచి బయటకు వచ్చిన వెంటనే పలువురు అధికారులు అతన్ని చుట్టుముట్టారు. ఇమ్మిగ్రేషన్ పత్రాలను చూపించినప్పటికీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వర్జీనియాలోని కరోలిన్ డిటెన్షన్ ఫెసిలిటీలో ఉంచినట్లు సమాచారం. ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట హియరింగ్‌ ఉందని తెలుస్తోంది. తమ స్నేహితుడు, ఫిల్మ్‌మేకర్ అరాఫత్ షేక్‌ను ICE అక్రమంగా అదుపులోకి తీసుకుందని ‘Support Arfat Sheikh’s Release’ క్యాంపెయిన్ నిర్వాహకులు తెలిపారు. అరాఫత్‌ను ICE అధికారులు అదుపులోకి తీసుకుంటున్న వీడియోను విడుదల చేసారు. అతన్ని విడిపించేందుకు న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం 50 వేల డాలర్లు సేకరిస్తున్నారు.

2019లో స్టూడెంట్ వీసాపై అమెరికాకు

అరాఫత్ షేక్ 2019లో స్టూడెంట్ వీసాపై చట్టబద్ధంగా అమెరికాలోకి ప్రవేశించారు. జార్జియా స్టేట్ యూనివర్సిటీలో ఫిల్మ్‌కు సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆయన అమెరికా వెళ్లారు. 2020లో ఆయన అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ప్రస్తుతం ఆ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. అరాఫత్ షేక్ వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో నివసిస్తున్నారు.

‘వాళ్లు ICE అధికారులని చెప్పిన అరాఫత్’

ఆర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంశంపై జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవార్డు విన్నింగ్ రచయిత, ఫిల్మ్‌మేకర్ తారా దొరాబ్జీతో కలిసి వాషింగ్టన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.అరాఫత్‌తో కలిసి ప్రయాణించిన తారా దొరాబ్జీ ఈ ఘటనపై స్పందించారు. విమానం  దిగిన సమయంలో అరాఫత్‌ను కొందరు వ్యక్తులు చుట్టుముట్టినట్లు తాను గమనించానని చెప్పారు. ‘విమానం నుంచి దిగుతున్నప్పుడు అరాఫత్‌ను దాటి వెళ్లిపోయాను. అతడిని పక్కకు తీసుకెళ్లారని అప్పటికి నాకు తెలియదు. అరాఫత్ నన్ను పిలవడంతో వెనక్కి తిరిగి చూశాను. అతడి చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉన్నారు’ అని ఆమె అన్నారు. అరాఫత్ తనతో, ‘తారా.. తారా.. వీళ్లు ICE. నా కోసం వచ్చారు’ అని చెప్పినట్లు తారా తెలిపారు. వారు సాధారణ దుస్తుల్లో ఉన్నారనీ ఫెడరల్ అధికారులు అని గుర్తించేలా యూనిఫాం ధరించలేదని ఆమె చెప్పారు. ఎలాంటి వారెంట్ చూపించలేదని, అరాఫత్‌ను ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని ఆమె ఆరోపించారు. అనంతరం అరాఫత్‌ను జెట్‌వే నుంచి విమానం నిలిపి ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లారనీ అతను ప్రతిఘటించలేదని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us