GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!

ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ GTA 6. ఈ గేమ్ ఆడిన తర్వాతే చనిపోవాలని ఓ యువకుడు ఎంతో ఆశపడ్డాడు. ఇందుకోసం తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకోవాలని ప్రయత్నించాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న గేమింగ్ అభిమానులు ఏకంగా రూ.94 లక్షలకు పైగా విరాళాలు కూడా అందించారు. కానీ విధి మరోలా నిర్ణయించింది. GTA 6 విడుదలకు కేవలం మూడు వారాల ముందు ఆ యువకుడు కన్నుమూశాడు.

GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
He Dreamed Of Playing Gta 6 But Died Just 3 Weeks Before Its Release

Updated on: Nov 05, 2026 | 10:32 AM

కొన్ని కలలు మనిషిని బతికిస్తాయి. మరికొన్ని ఆశలు చివరి క్షణం వరకు జీవించాలనే పట్టుదలను ఇస్తాయి. అమెరికాకు చెందిన 25 ఏళ్ల యువకుడు జెర్రీ స్టీఫెన్స్ విషయంలోనూ ఇదే జరిగింది. సోషల్ మీడియాలో ‘వాయిడ్ ఓన్లీ’ (Void Only) పేరుతో గుర్తింపు పొందిన అతడికి వీడియో గేమ్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న GTA 6 గేమ్ ఆడాలని బలంగా కోరుకున్నాడు. అయితే తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి అతడిని కష్టాల్లోకి నెట్టింది. ఎలాగైనా బతికి ఉండి ఆ గేమ్ ఆడాలన్న అతడి కోరిక చివరకు తీరకుండానే కన్నుమూశాడు. ఈ విషాద వార్త గేమింగ్ ప్రపంచాన్ని కలచివేస్తోంది.

రూ.94 లక్షలకు పైగా విరాళాలు.. దక్కని ప్రాణం!

జెర్రీ తీవ్రమైన ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్‌తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతడి ఊపిరితిత్తులు క్రమంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి మరింత విషమించడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంతో అతడి కథ ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.జెర్రీకి GTA 6 గేమ్ అంటే ఎంత ఇష్టమో తెలుసుకున్న అభిమానులు అతడికి అండగా నిలిచారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స, తర్వాత కోలుకోవడానికి అవసరమైన ఖర్చుల కోసం విరాళాలు సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్పందించి ఏకంగా రూ.94 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించారు. ఎలాగైనా చికిత్స చేయించుకుని నవంబర్ 19న విడుదల కానున్న GTA 6 ఆడాలని జెర్రీ ఆశపడ్డాడు.

‘నా ఊపిరితిత్తులు సహకరించడం లేదు’.. చివరి విజ్ఞప్తి!

గత ఆగస్టులో ‘I Just Want To Play GTA 6’ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో జెర్రీ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. ఇక నా వల్ల కావడం లేదు. నా ఊపిరితిత్తులు పనిచేయలేకపోతున్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి జరిగే వరకు నన్ను ఐసీయూలో ఉంచాల్సి ఉంటుంది’ అని ఆ వీడియోలో చెప్పాడు. తనకు ఆర్థికంగా సాయం చేయాలనుకునేవారు విరాళాలు అందించవచ్చని పేర్కొన్నాడు. అయితే ఇతరులకు కూడా డబ్బు అవసరమని, అందరి దగ్గరా సాయం అడగడానికి మొదట సంకోచించానని తెలిపాడు. కానీ చికిత్స, కోలుకునే ప్రక్రియ కోసం మాత్రం ఆర్థిక సాయం అవసరమని విజ్ఞప్తి చేశాడు.

అక్టోబర్ 29న తుదిశ్వాస.. సోదరి భావోద్వేగ పోస్ట్

 

అయితే జెర్రీ ఆరోగ్యం మరింత క్షీణించింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా అతడి ఊపిరితిత్తుల్లో రక్తం నిండిపోయింది. చివరకు అక్టోబర్ 29న అతడు కన్నుమూశాడు. ఈ విషాద విషయాన్ని అతడి సోదరి పారిస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘హాయ్ అందరికీ.. నేను జెర్రీ సోదరిని. జెర్రీ మనల్ని విడిచివెళ్లిపోయాడు. అక్టోబర్ 29న అతడు చివరిసారిగా శ్వాస తీసుకున్నాడు. మీరందించిన ప్రేమ, మద్దతు అతడి జీవితంలోని చివరి కొన్ని నెలలను ఎంతో అందంగా మార్చాయి. మీ అందరి అభిమానానికి అతడు చాలా సంతోషించాడు. ఇప్పుడు అతడు బాధపడటం లేదు. ప్రశాంతంగా ఉన్నాడు’ అంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. అలాగే జెర్రీకి మద్దతుగా నిలిచిన అభిమానుల కోసం కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా బెలూన్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. తేదీ ఖరారైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.

నాలుగేళ్లుగా గేమింగ్ కంటెంట్

జెర్రీ 2022 నుంచి సోషల్ మీడియాలో గేమింగ్, మ్యూజిక్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. Warframe, Marvel’s Spider-Man, Hitman వంటి గేమ్స్ కంటెంట్ రూపొందించేవాడు. ముఖ్యంగా GTA 6 విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాడు.
నవంబర్ 19న GTA 6 విడుదల కానుండగా.. ఆ గేమ్ ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. గేమ్ విడుదలకు కేవలం మూడు వారాల ముందే జెర్రీ మరణించడంతో అతడి కథ తెలిసిన గేమింగ్ అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది అభిమానుల ప్రేమ, రూ.94 లక్షలకు పైగా విరాళాలు.. ఇవన్నీ అతడి చివరి రోజుల్లో ఎంతో ఆనందాన్ని ఇచ్చినా, అతడు కోరుకున్న ఒక్క కల మాత్రం తీరకుండానే మిగిలిపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us