
ఆ గద్దకు ఎలాంటి గాయాలు కాలేదు.. అనారోగ్యమూ లేదు. మరీ ఎక్కువగా తిని లావైపోవడమే అసలు సమస్య! రోజూ కోళ్లను వేటాడి కడుపునిండా తినడం.. ఆ తర్వాత చెట్లపై హాయిగా నిద్రపోవడం.. ఇదే దాని దినచర్యగా మారిపోయింది. చివరకు బరువు పెరిగి ఎగరలేని పరిస్థితికి చేరుకుంది. ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అమెరికాలోని వర్జీనియాలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. అక్కడి సౌత్‌వెస్ట్ వర్జీనియా వైల్డ్‌లైఫ్ సెంటర్‌కు కేవలం ఒక మైలు దూరంలోని ఓ ఇంటి డ్రైవ్‌వేలో ఓ రెడ్ షౌల్డర్డ్ గద్ద (Red-shouldered Hawk) నేలపై కనిపించింది. సాధారణంగా గాల్లో ఎగురుతూ వేటాడాల్సిన పక్షి ఇలా కదలలేక ఉండటంతో స్థానికులు దానిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.
నిపుణులు మొదట ఆ గద్దను క్షుణ్ణంగా పరీక్షించారు. ఎముకలు విరిగాయా? ఏదైనా ప్రమాదంలో గాయపడిందా? సీసం వంటి విషపదార్థాలు శరీరంలోకి చేరాయా? కంటి సమస్యలు ఉన్నాయా? తలకు దెబ్బ తగిలిందా? ఇలా అన్ని కోణాల్లో పరిశీలించారు. కానీ పరీక్షల్లో ఎలాంటి సమస్య బయటపడలేదు.
అయితే ఆ గద్ద బరువు చూసి నిపుణులు ఆశ్చర్యపోయారు. దాని బరువు ఏకంగా 910 గ్రాములకు పైగా ఉంది. శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోవడంతో దాని ఎముకల నిర్మాణం కూడా స్పష్టంగా కనిపించలేదు. దీంతో అసలు సమస్యను గుర్తించిన నిపుణులు.. ఈ గద్ద మరీ లావైపోయి ఎగరలేకపోతోందని తేల్చారు. సరదాగా దీనికి ‘Too Fat to Fly’ అంటే.. ఎగరలేనంత లావుగా మారిందని నిర్ధారించారు.
ఇంతకీ ఈ గద్ద ఇంతలా బరువు పెరగడానికి కారణం ఏమిటో తెలుసా? దాని అదృష్టమో.. కోళ్ల యజమానుల దురదృష్టమో కానీ.. దానికి ఆహారం వెతుక్కుంటూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. సమీపంలోని ఓ ప్రాంతంలో కోళ్లను స్వేచ్ఛగా బయట తిరగనిచ్చేవారు. దీంతో ఆ గద్దకు అవే సులభమైన ఆహారంగా మారాయి.
ఉదయం కోళ్లను బయటకు వదలగానే వాటిపై వేట మొదలుపెట్టేది. ఓ కోడిని తినేసి సమీపంలోని చెట్లపైకి వెళ్లి హాయిగా నిద్రపోయేది. మళ్లీ ఆకలేస్తే మరో కోడిని వేటాడేది. ఇలా తినడం.. నిద్రపోవడం.. మళ్లీ తినడం.. ఇదే దాని దినచర్యగా మారిపోయింది. వారాల తరబడి ఈ విధంగా కొనసాగడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి చివరకు ఎగరలేని స్థితికి చేరుకుంది. ఈ విషయాన్ని సౌత్‌వెస్ట్ వర్జీనియా వైల్డ్‌లైఫ్ సెంటర్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. దీంతో ఈ గద్ద కథ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నవ్వులు పూస్తున్నాయి. ‘లావుగా ఉందని వైద్యులు నిర్ధారించడం మాత్రం అదిరిపోయింది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అడవి పక్షికి డైట్ ఎలా చేయిస్తారు? వ్యాయామం చేయిస్తారా?’, ‘తిరిగి అడవిలోకి వదిలిన తర్వాత మళ్లీ కోళ్లను తింటూ బరువు పెరిగితే పరిస్థితి ఏంటి?’ ఇంకొకరు సరదాగా అడిగారు. మరికొందరు తమకు ఎదురైన అనుభవాలను కూడా పంచుకున్నారు. తమ పెరట్లో స్వేచ్ఛగా తిరిగే కోళ్లను గద్దలు ఒక్కొక్కటిగా ఎత్తుకెళ్లేవని తెలిపారు. వాటిని రక్షించుకోవడానికి మెష్‌తో ప్రత్యేకమైన కదిలే గూటిని ఏర్పాటు చేసుకున్నామని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన వినడానికి నవ్వు తెప్పించినా.. ఆ గద్ద పరిస్థితి మాత్రం ప్రమాదకరమే. సాధారణంగా గద్దలు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వేగంగా ఎగిరిపోతాయి. కానీ అధిక బరువు కారణంగా ఎగరలేకపోతే పెద్ద పక్షులు, ఇతర వేటాడే జంతువులకు సులభంగా చిక్కే ప్రమాదం ఉంది. తనను తాను రక్షించుకోవడం కూడా కష్టమవుతుంది.
మొత్తానికి.. వేటాడటంలో దిట్టగా ఉండాల్సిన గద్ద కాస్తా, కోళ్ల విందుకు అలవాటుపడి ఎగరలేని పరిస్థితికి చేరుకుంది. ఆకలి తీరితే చాలు.. ఇంకేం అక్కర్లేదన్నట్లు గడిపిన దాని లైఫ్‌స్టైల్ చివరకు ఇలా కొంపముంచింది. అందుకే ఈ గద్ద కథ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులతో పాటు ఆసక్తికర చర్చకు కూడా కారణమవుతోంది!