
దక్షిణ ఫ్రాన్స్‌లోని మెజ్ (Mèze) పట్టణం సమీపంలో పరిశోధకులకు వంద గుడ్లు ఒకే చోట కనిపించాయి. ఇంత పెద్ద సంఖ్యలో గుడ్లు లభించడం అరుదని పరిశోధకుడు అలైన్ కాబోట్ చెప్పారు. ఈ ప్రాంతంలో 50 కిలోమీటర్ల మేర డైనోసార్ల ఆనవాళ్లు విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ క్రెటేషియస్ కాలం చివరి దశకు చెందినవి. దీంతో ఈ ప్రాంతం డైనోసార్ల చరిత్ర కు పరిశోధనా కేంద్రంగా మారింది.
ఇక్కడ లభించిన గుడ్లలో ఎక్కువ భాగం భారీ శాకాహార డైనోసార్లైన టైటానోసార్లకు చెందినవి కావచ్చని భావిస్తున్నారు. ఈ టైటానోసార్లు సాధారణ డైనోసార్లు కాదు.. నాలుగు కాళ్లతో నడిచే భారీ సౌరోపాడ్ జాతికి చెందినవి. భూమిపై ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద జంతువుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇన్ని గుడ్లు బయటపడినా.. వాటిని కచ్చితంగా ఏ జాతి డైనోసార్లు పెట్టాయన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. టైటానోసార్లతో పాటు రాబ్డోడాంట్స్ అనే శాకాహార డైనోసార్లు, డ్రోమియోసార్లు అనే చిన్న మాంసాహార డైనోసార్లకు సంబంధించిన శిలాజాలు కూడా బయటపడ్డాయి. అంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో రకరకాల డైనోసార్లు సంచరించేవి.
ఈ గుడ్ల ఆవిష్కరణ డైనోసార్ల అంతానికి ముందు ఏం జరిగిందనే ప్రశ్నకు సమాధానాలు వెతికేందుకు శాస్త్రవేత్తలకు కీలక ఆధారం కానుంది. ఇక్కడ లభించిన గుడ్లలో ఏకంగా 95 శాతం ఇప్పటికే పొదిగి పిల్లలు బయటకు వచ్చినవే. అయితే గుడ్లు పెట్టిన డైనోసార్లు ఏ జాతికి చెందినవో తెలుసుకోవడం అంత సులభం కాదు. గుడ్ల లోపల పిండాలు లేదా అప్పుడే పుట్టిన చిన్న డైనోసార్ల శిలాజాలు లభిస్తేనే వాటి జాతిని కచ్చితంగా గుర్తించగలరు. ప్రస్తుతం అలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ మిస్టరీ ఇంకా వీడలేదు.
డైనోసార్లు అంతరించిపోవడానికి కొన్ని మిలియన్ సంవత్సరాల ముందే వాటి జాతుల వైవిధ్యం తగ్గినట్లు భౌగోళిక పొరల పరిశీలనలో తెలిసింది. అంటే భారీ వినాశనం జరగడానికి ముందే కొన్ని డైనోసార్ జాతుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఓ భారీ గ్రహశకలం ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుత మెక్సికోలోని చిక్సులబ్ ప్రాంతంలో ఆ గ్రహశకలం పడినట్లు ఆధారాలు ఉన్నాయి. మరి ఆ వినాశనానికి ముందే డైనోసార్ల ప్రపంచంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కొత్త శిలాజాలు ఆ రహస్యాలను ఛేదిస్తాయని ఆశిస్తున్నారు.
ఈ ఆవిష్కరణ డైనోసార్ల చరిత్రతో పాటు కోట్ల ఏళ్ల క్రితం యూరప్ ఎలా ఉండేదో కళ్లకు కట్టింది. అప్పట్లో యూరప్ ఇప్పటిలా ఒకే భూభాగంగా ఉండేది కాదు. క్రెటేషియస్ కాలం చివరి దశలో చాలా ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయి ఉండగా, మిగిలిన భూములు చిన్నచిన్న దీవుల సమూహాలుగా విస్తరించి ఉండేవి. ఈ ప్రాంతమంతా విస్తారమైన నదులు, పచ్చని మైదానాలతో నిండి ఉండేది. కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్ల సంచారానికి, గుడ్లు పెట్టడానికి అనువైన ఆవాసం ఇదే.
పరిశోధకుడు అలైన్ కాబోట్ అభిప్రాయం ప్రకారం.. టైటానోసార్లు ఒకేచోట కాకుండా గుంపులుగా నదీ మైదానాల్లో తిరుగుతూ ఉండేవి. ఆధునిక కాలంలో తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు నిర్దిష్ట ప్రాంతాలకు తిరిగి వచ్చినట్లుగానే, ఈ భారీ డైనోసార్లు కూడా తమకు అనువైన ప్రాంతాలకు మళ్లీ మళ్లీ వచ్చి గుడ్లు పెట్టేవి. ఆ తర్వాత నదుల ప్రవాహంతో కొట్టుకొచ్చిన మట్టి, ఇసుక పొరలు ఆ గుడ్లను పూర్తిగా కప్పేశాయి. అలా భూమి పొరల్లో లక్షల ఏళ్ల పాటు నిక్షిప్తమై అవి క్రమంగా శిలాజాలుగా మారాయి. పైరినీస్ పర్వతాలు ఏర్పడే క్రమంలో భూమి లోపలి పొరల్లో ఉన్న ఈ పురాతన శిలాజాలు ఉపరితలానికి దగ్గరగా వచ్చాయి. దీంతో ఇప్పుడు శాస్త్రవేత్తలు వాటిని గుర్తించి వెలికితీసే అవకాశం దక్కింది. ఒకప్పుడు భారీ డైనోసార్ల సంతానోత్పత్తికి నిలయంగా ఉన్న ఈ ప్రాంతం.. ఇప్పుడు ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు కీలక కేంద్రంగా నిలుస్తోంది.