సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది.. దీంతో మామూలుగా ఉండదు..

సింహం నోటికి చిక్కినా ఈజీగా ఎస్కేప్ అయిపోతుంది.. ఎంతటి భయంకరమైన పామునైనా నూడుల్స్‌లా తినేస్తుంది.. ప్రపంచంలోనే భయం తెలియని ఆ జంతువును చూశారా? బుల్లెట్ ప్రూఫ్‌లాంటి చర్మం, విషాన్ని సైతం జీర్ణించుకునే బాడీ.. దీని కథ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. గిన్నిస్ బుక్ రికార్డుల్లో నిలిచిన రియల్ బాహుబలి గురించి తెలుసుకుందాం..

సింహాలకే చెమటలు పట్టిస్తది.. పాములను నూడుల్స్ లెక్క తింటది.. దీంతో మామూలుగా ఉండదు..
Honey Badger Interesting Facts

Updated on: May 17, 2026 | 6:18 PM

మనం ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాల గురించి వింటుంటాం. అడవికి రాజు సింహం అని, అత్యంత క్రూరమైనది పులి అని మనకు తెలుసు. కానీ పులులకు, సింహాలకు అస్సలు భయపడని.. ఎంతటి విషసర్పం కాటు వేసినా చనిపోని ఒక విచిత్రమైన జీవి ఈ భూమిపై ఉందని మీకు తెలుసా..? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సైతం దీనిని ‘‘ప్రపంచంలోనే భయం అంటే తెలియని జీవి’’ గా గుర్తించింది. ఆ జంతువే హనీ బ్యాడ్జర్. దీన్ని శాస్త్రీయ నామం మెలివోరా కాపెన్సిస్. పరిమాణంలో చిన్నదైనప్పటికీ, చిన్న ఎలుగుబంటిలా కనిపించే ఈ జంతువుకు భయం అనే పదమే తెలియదు.

ఎక్కడ నివసిస్తుంది?

హనీ బ్యాడ్జర్లు సాధారణంగా ఆఫ్రికా అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు నైరుతి ఆసియా, భారత ఉపఖండంలోని కొన్ని వన్యప్రాంతాలలో కూడా ఇవి జీవిస్తాయి. ఎడారులు, దట్టమైన పొదలు, రాతి పర్వతాలు వంటి కఠినమైన వాతావరణంలో కూడా ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని జీవించగల అద్భుతమైన సామర్థ్యం వీటికి ఉంది.

దీనికున్న అతీత శక్తులు ఏంటి..?

హనీ బ్యాడ్జర్‌కు ప్రకృతి ప్రసాదించిన కొన్ని శారీరక లక్షణాలు దీనిని అజేయమైన శక్తిగా మార్చాయి.

బుల్లెట్ లాంటి చర్మం: దీని చర్మం చాలా మందంగా, రబ్బరు లాగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. సింహం లేదా చిరుతపులి దీనిని నోట కరుచుకున్నా.. ఆ చర్మం లోపల ఇది సులభంగా తిరిగి, ఎదురు దాడి చేయగలదు. నిపుణుల ప్రకారం.. వీటి చర్మంపై పదునైన కత్తులు, బాణాలు, చివరకు తేనెటీగల ముళ్లు కూడా పనిచేయవు.

యాంటీ-వెనమ్ బాడీ: హనీ బ్యాడ్జర్‌కు పాములంటే చాలా ఇష్టం. ఎంతటి ప్రమాదకరమైన నల్లతాచు లేదా వైపర్ కాటు వేసినా వీటికి ఏమీ కాదు. పాము కాటు వేసినప్పుడు ఆ విషం ప్రభావానికి ఇది కాసేపు స్పృహ కోల్పోతుంది. కానీ రెండు మూడు గంటల్లోనే తిరిగి ఏమీ కానట్టు లేచి, అదే పామును ముక్కలు ముక్కలుగా నమిలి తినేస్తుంది. వీటి కాళ్లకు ఉండే గోళ్లు చాలా పొడవుగా, పదునుగా ఉంటాయి. ఎంతటి గట్టి నేలనైనా క్షణాల్లో తవ్వేయగలవు. శత్రువులు దాడి చేసినప్పుడు ఈ గోళ్లతోనే చీల్చి చెండాడుతాయి.

తేనె కోసం ఎంతకైనా తెగిస్తుంది

దీనికి హనీ బ్యాడ్జర్ అనే పేరు ఊరికే రాలేదు. దీనికి తేనె అంటే ప్రాణం. కొండలపై ఉండే పెద్ద పెద్ద తేనెపట్టులపై ఇది నేరుగా దాడి చేస్తుంది. వేలాది తేనెటీగలు ఒకేసారి కుట్టినా లెక్కచేయకుండా తేనెను అందులోని లార్వాలను ఆస్వాదిస్తుంది. తేనెతో పాటు పాములు, పక్షులు, ఎలుకలు, చిన్న చిన్న జంతువులను ఇది ఆహారంగా తీసుకుంటుంది.

హనీ బ్యాడ్జర్లు ఎంత తెలివైనవంటే.. ఇవి వేటాడటానికి, శత్రువుల నుండి తప్పించుకోవడానికి రాళ్లు, కర్రలను టూల్స్ లాగా ఉపయోగించగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిమాణంలో చిన్నదైనా.. ఆత్మవిశ్వాసంలో, ధైర్యంలో అడవి మృగాలకే చెమటలు పట్టించే ఈ హనీ బ్యాడ్జర్ నిజంగానే ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం.

Follow Us