ప్రతి చిన్నారికి SpaceX లో షేరు ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి తన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో ఒక్కో షేర్ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఇప్పుడు టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ప్రతి చిన్నారికి SpaceX లో షేరు ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Elon Musk Says He Will Give One Spacex Share To Every Kid In America

Updated on: Oct 20, 2026 | 10:07 AM

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి తన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో ఒక్కో షేర్ ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఇప్పుడు టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో 7.3 కోట్ల మంది పిల్లలకు లబ్ధి?

‘వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి చిన్నారికి స్పేస్‌ఎక్స్‌లో ఒక షేర్ ఇస్తాను. ఇది ఇలాంటి అనేక కార్యక్రమాల్లో మొదటిది మాత్రమే’.. ఎలాన్ మస్క్ సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ప్రకటన చేశారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం.. 18 ఏళ్లలోపు వారు దాదాపు 7.3 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ఒక్కో షేర్ ఇవ్వాలన్నది మస్క్‌ ఆలోచన. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి స్పేస్‌ఎక్స్ షేరు ధర 146 డాలర్లుగా ఉంది. ఈ ధర ప్రకారం 7.3 కోట్ల మంది పిల్లలకు ఒక్కో షేర్ ఇస్తే మొత్తం విలువ సుమారు 10.7 బిలియన్ డాలర్లు అవుతుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.90 వేల కోట్లకు పైనే. అయితే, ఇది ప్రస్తుత షేరు ధర ఆధారంగా వేసిన అంచనా మాత్రమే. భవిష్యత్తులో షేర్ల ధర మారవచ్చు.

షేర్లు ఎలా ఇస్తారు? అర్హతలు ఏమిటి?

మస్క్ ప్రకటన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. అమెరికాలోని కోట్లాది మంది పిల్లలకు షేర్లను ఏ విధంగా పంపిణీ చేస్తారు? పిల్లలందరికీ ఈ అవకాశం ఉంటుందా? వయస్సు, ఆదాయం లేదా ఇతర అర్హతలు ఉంటాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

ఇప్పటికే పిల్లల కోసం మరో పెట్టుబడి పథకం

అమెరికాలో చిన్నారులకు పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనం కల్పించాలనే ఆలోచన కొత్తది కాదు. ఇటీవల అమెరికా ప్రభుత్వం కూడా పిల్లల కోసం ‘ట్రంప్ అకౌంట్స్’ పేరుతో పొదుపు, పెట్టుబడి ఖాతాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2025 ప్రారంభం నుంచి 2028 చివరి వరకు జన్మించిన అర్హులైన పిల్లలకు ప్రభుత్వం ఒకేసారి 1,000 డాలర్లను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లలోపు లక్షలాది మందికి ఖాతాలను ఆటోమేటిక్‌గా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఆంథ్రోపిక్ ప్రకటనకు మస్క్ కౌంటర్?

ఎలాన్ మస్క్ ఈ ప్రకటన చేయడానికి ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి చెందిన ఆంథ్రోపిక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ షేర్లలో కనీసం 5 శాతాన్ని ‘పబ్లిక్ బెనిఫిట్ ఫండ్’ కు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ నిధులను సామాజిక ప్రయోజనాల కోసం వినియోగించనుంది.

ఆంథ్రోపిక్ తాజా ప్రైవేట్ కంపెనీ విలువ ఆధారంగా ఈ వాటా విలువ సుమారు 48 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలు ఇవ్వడంతో పాటు, అవసరమైన కొన్ని వర్గాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నవారికి సహాయం చేయడం ఈ నిధి లక్ష్యాల్లో ఒకటి. ఈ ప్రకటనపై స్పందించిన మస్క్.. కంపెనీ షేర్లను నేరుగా ప్రజలకు ఇవ్వాలని సూచించారు. తాను కూడా అదే విధంగా చేయనున్నట్లు ఎక్స్‌లో తెలిపారు. దీంతో ఆంథ్రోపిక్ ప్రకటనకు ప్రతిస్పందనగానే మస్క్ ఈ హామీ ఇచ్చారా? అనే చర్చ  మొదలైంది.

గతంలోనూ భారీ విరాళాల హామీలు

పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష పరిశోధనలు, చిన్నారుల వైద్య పరిశోధనలు వంటి రంగాల్లో మస్క్ ఫౌండేషన్ నిధులు అందిస్తోంది. 2024 చివరి నాటికి ఈ ఫౌండేషన్ వద్ద 14 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అయితే, ఆ సంవత్సరంలో ఇచ్చిన విరాళాల్లో ఎక్కువ భాగం మస్క్ వ్యాపార ప్రయోజనాలకు దగ్గరగా ఉన్న సంస్థలకు వెళ్లాయనే ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలపై స్పేస్‌ఎక్స్ అప్పట్లో స్పందించలేదు.

సంప్రదాయ దాతృత్వ కార్యక్రమాల ప్రభావంపై మస్క్ గతంలో ప్రశ్నలు లేవనెత్తారు. విరాళాలు ఇవ్వడం ద్వారా మంచి వ్యక్తిగా కనిపించడం సులభమే కానీ, నిజంగా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిధులు వినియోగించడం కష్టమని వ్యాఖ్యానించారు.  ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా ప్రపంచ ఆకలిని నిర్మూలించగలమని ఐక్యరాజ్యసమితి నిరూపిస్తే, 6 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించి విరాళంగా ఇస్తానని 2021లో మస్క్ ప్రకటించారు. అయితే, ఆ మొత్తం విరాళాన్ని ఆయన ఇప్పటివరకు అందించలేదు.

ఏఐ సంస్థలపై పెరుగుతున్న ఒత్తిడి

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళనతో పాటు, ఈ సాంకేతికత భద్రత, సమాజంపై దాని ప్రభావం, భారీ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి కలిగే నష్టం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంథ్రోపిక్ తన కంపెనీ వాటాలో కొంత భాగాన్ని సామాజిక ప్రయోజనాలకు కేటాయిస్తామని ప్రకటించగా, మస్క్ నేరుగా పిల్లలకు షేర్లు అందిస్తానని ముందుకొచ్చారు. మస్క్‌ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అమెరికాలోని కోట్లాది మంది పిల్లలకు కంపెనీ యాజమాన్యంలో వాటా పొందే అవకాశం లభించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us