
మన దేశంలో గట్టిగా పాతుకుపోయిన విచిత్రమైన నమ్మకాల్లో గర్భిణీ స్త్రీలను పాములు కాటు వేయవు అనేది ఒకటి. ఇప్పటికీ అనేక పల్లెల్లో అమ్మమ్మలు, నాయనమ్మల నోటి వెంట ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. సృష్టి పరిణామానికి కారణమయ్యే మాతృత్వాన్ని ప్రకృతి ఆటోమేటిక్‌గా రక్షిస్తుందని కొందరు విశ్వసిస్తే.. దీని వెనుక జ్యోతిష్య కారణాలు ఉన్నాయని మరికొందరు వాదిస్తారు. పురాణాల ప్రకారం.. గర్భం దాల్చిన మహిళను సాక్షాత్తు ఆదిశక్తి రూపంగా పరిగణిస్తారు. శివకేశవుల అలకారాలైన సర్పాలు.. మహిళ కడుపులోని జీవాన్ని గుర్తించగలవని, సృష్టిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి ఆటంకం కలిగించకుండా అవి పక్కకు తొలిగిపోతాయని పౌరాణిక కథలు చెబుతున్నాయి. మరోవైపు జ్యోతిష్య రీత్యా చూస్తే.. పాములను రాహు-కేతువుల స్వరూపంగా భావిస్తారు. గర్భధారణ సమయంలో మహిళ చుట్టూ ఒక ప్రత్యేకమైన సానుకూల ఆరా ఏర్పడుతుందని.. ఇది ప్రతికూల గ్రహాల తీవ్రతను తగ్గించి సర్పాలు దాడి చేయకుండా నిరోధిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం.
వైద్య నిపుణులు, జీవశాస్త్రవేత్తలు మాత్రం ఈ నమ్మకాన్ని పూర్తిగా కొట్టిపడేస్తున్నారు. పాములకు ఎదుటి వ్యక్తి పురుషుడా, స్త్రీయా లేదా గర్భిణీనా అని గుర్తించే విచక్షణ జ్ఞానం ఉండదని సైన్స్ స్పష్టం చేస్తుంది. పాము కాటు వేయడం అనేది కేవలం తనను తాను రక్షించుకోవడానికి చేసే ఆత్మరక్షణ చర్య మాత్రమే. పొరపాటున కాలు పడినా లేదా ప్రమాదాన్ని పసిగట్టినా అది ఎవరినైనా కాటు వేస్తుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే వాసన పాములను దూరంగా ఉంచుతుందనే ప్రచారానికి కూడా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెడితే.. ప్రాణాల విషయంలో విశ్వాసాల కంటే హెచ్చరికలే ముఖ్యం. చీకటి ప్రదేశాలు లేదా పొదల్లోకి వెళ్లేటప్పుడు గర్భిణీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ అవాంఛనీయంగా పాము కాటుకు గురైతే నమ్మకాలపై ఆధారపడకుండా వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లేలా చూడటమే సురక్షితం.