AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెనడాలో రెస్టారెంట్ సంచలన నిర్ణయం..15 ఏళ్లలోపు పిల్లలకు నో ఎంట్రీ.. ఎందుకో తెలుసా?

సాధారణంగా రెస్టారెంట్లకు కుటుంబ సమేతంగా వెళ్లి భోజనం చేస్తుంటారు. అయితే కెనడాలోని ఓ రెస్టారెంట్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు తమ రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని ప్రకటించింది. ఇంతకీ ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారు?

కెనడాలో రెస్టారెంట్ సంచలన నిర్ణయం..15 ఏళ్లలోపు పిల్లలకు నో ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
Canada RestaurentImage Credit source: Pixabay
Janardhan Veluru
|

Updated on: Nov 13, 2026 | 12:26 PM

Share

సాధారణంగా రెస్టారెంట్లకు కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి భోజనం చేయాలని చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం ఎవరికైనా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే కెనడాలోని ఓ రెస్టారెంట్ మాత్రం ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు తమ రెస్టారెంట్‌లోకి ఎంట్రీ లేదని ప్రకటించింది. ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కెనడాలోని విన్నిపెగ్ నగరంలో నవంబర్ 30న కొత్త శాఖను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న జమైకన్ రెస్టారెంట్ మిస్ క్రిస్టీన్ కిచెన్ (Miss Christine’s Kitchen) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్ యజమాని, చెఫ్ క్రిస్టీన్ ప్యాటిసన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

తమ రెస్టారెంట్‌కు వచ్చే అతిథులు ప్రశాంతమైన వాతావరణంలో భోజనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. పెద్దలు తమ వ్యక్తిగత సమయాన్ని ప్రశాంతంగా గడపడానికి, స్నేహితులతో మాట్లాడుకోవడానికి, ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడమే తమ ఉద్దేశమని వివరించారు. అందుకే తమ రెస్టారెంట్‌లో 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. 15 ఏళ్లలోపు పిల్లలను అనుమతించబోమని ప్రకటించారు.

15 ఏళ్ల లోపు పిల్లలకు నో ఎంట్రీ 

ఇవి కూడా చదవండి

నిర్ణయానికి మద్దతు.. వ్యతిరేకత

కెనడాలోని ఆ రెస్టారెంట్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ప్రతిచోటా పిల్లలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని, పెద్దలు కూడా ప్రశాంతంగా సమయం గడిపేందుకు కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రెస్టారెంట్లు కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండాలని, పిల్లలను వయసు ఆధారంగా అనుమతించకపోవడం సరైన విధానం కాదని విమర్శించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే హక్కు పిల్లలకు కూడా ఉందని పేర్కొన్నారు. ఈ వివాదం మరింత ముదరడంతో రెస్టారెంట్ యజమానికి సోషల్ మీడియాలో ప్రతికూల స్పందనలు ఎదురయ్యాయి. కొందరు ఒక స్టార్ రేటింగ్స్ ఇస్తూ నెగెటివ్ రివ్యూలు కూడా పోస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

అయితే నెగటివ్ రివ్యూలను లెక్క చేయని క్రిస్టీన్ ప్యాటిసన్.. తల్లిదండ్రులు తమ కుటుంబాల కోసం కష్టపడి సంపాదిస్తున్నారని చెప్పారు. పెద్దలకు కూడా అప్పుడప్పుడు పిల్లల బాధ్యతల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గడిపేందుకు వ్యక్తిగత సమయం అవసరమని వివరించారు. పెద్దలు తమ భాగస్వాములతో లేదా స్నేహితులతో కలిసి ఎలాంటి అంతరాయాలు లేకుండా భోజనాన్ని ఆస్వాదించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Follow Us