AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెహ్రూ మరణానికి పదేళ్ల ముందు నుంచే బాలల దినోత్సవం.. నవంబర్ 14 వెనుక అసలు కథ ఇదే!

Children's Day History: నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకోవడం వెనుక నెహ్రూ జయంతి మాత్రమే కాకుండా పిల్లల సంక్షేమం, హక్కులు, భవిష్యత్తుకు సంబంధించిన సుదీర్ఘ చరిత్ర ఉంది. 1956లో బాల సంక్షేమ దినోత్సవంగా ప్రారంభమైన కార్యక్రమాలకు, 1964 తర్వాత నెహ్రూ జయంతి సందర్భంగా ప్రత్యేక గుర్తింపు లభించింది.

నెహ్రూ మరణానికి పదేళ్ల ముందు నుంచే బాలల దినోత్సవం.. నవంబర్ 14 వెనుక అసలు కథ ఇదే!
Children's Day History
Janardhan Veluru
|

Updated on: Nov 12, 2026 | 6:29 PM

Share

ప్రతి సంవత్సరం నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం (Children’s Day) జరుపుకుంటాం. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ రోజును బాలల దినోత్సవంగా నిర్వహిస్తారు. పిల్లలంటే ఎంతో ఇష్టపడే నెహ్రూను చిన్నారులు ప్రేమగా ‘చాచా నెహ్రూ’ అని పిలిచేవారు. అయితే నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకోవడం నెహ్రూ మరణం తర్వాతే ప్రారంభమైందని చాలామంది భావిస్తారు. కానీ ఈ వేడుకకు సంబంధించిన చరిత్రలో ఆసక్తికరమైన విషయం ఉంది. నెహ్రూ మరణానికి దాదాపు పదేళ్ల ముందే నవంబర్ 14న పిల్లల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

1956లోనే బాల సంక్షేమ దినోత్సవం ప్రారంభం!

భారత్‌లో నవంబర్ 14ను బాలల సంక్షేమ దినోత్సవంగా (Child Welfare Day) నిర్వహించడం 1956లోనే ప్రారంభమైందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే అప్పట్లో ఈ రోజును నేటిలా బాలల దినోత్సవంగా పిలిచేవారు కాదు. పిల్లల సంక్షేమం, వారి హక్కులు, విద్య, అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశంగా ఉండేది. ఆ సమయంలో పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వాటి గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు నవంబర్ 14న బాల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

నెహ్రూ మరణం తర్వాత బాలల దినోత్సవంగా గుర్తింపు

జవహర్‌లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించారు. పిల్లలపై ఆయనకు ఉన్న ప్రేమ, అభిమానం కారణంగా చిన్నారులు ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన వారి విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. 1964 మే 27న నెహ్రూ మరణించిన తర్వాత ఆయన జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో నవంబర్ 14కు బాలల దినోత్సవంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ రోజును బాలల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు నవంబర్ 20న బాలల దినోత్సవం

భారత్‌లో బాలల దినోత్సవం చరిత్రలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. నెహ్రూ మరణానికి ముందు మన దేశంలో నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఐక్యరాజ్యసమితి (UNO) నవంబర్ 20ను ప్రపంచ బాలల దినోత్సవంగా (World Children’s Day) ప్రకటించింది. 1954లో ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంక్షేమం, హక్కులపై అవగాహన పెంచేందుకు యూనివర్సల్ చిల్డ్రన్స్ డేను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ రోజున పలు దేశాల్లో బాలల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభమైంది. భారత్ కూడా నవంబర్ 20న ఈ వేడుకల్లో పాల్గొనేది. అయితే 1964లో నెహ్రూ మరణం తర్వాత ఆయన జయంతి అయిన నవంబర్ 14ను భారత బాలల దినోత్సవంగా నిర్ణయించారు.

బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

బాలల దినోత్సవం అంటే కేవలం పిల్లలకు బహుమతులు ఇవ్వడం, ఆటపాటలతో ఆనందించడం మాత్రమే కాదు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, సమాన అవకాశాలు అందించాల్సిన బాధ్యతను గుర్తుచేసే రోజు ఇది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆటలు, పాటలు, నృత్యాలు, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు ఏర్పాటు చేస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. అనాథాశ్రమాలు, బాలల సంక్షేమ కేంద్రాల్లోనూ చిన్నారులకు బహుమతులు, పుస్తకాలు పంపిణీ చేస్తారు.

ప్రతి చిన్నారికి మంచి బాల్యం అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, పోషకాహార లోపం, విద్యకు దూరమవడం వంటి సమస్యలను అరికట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వడంతో పాటు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి.

Follow Us