వింతలకే పెద్ద వింత.. వెనక్కి ఎగిరే ఏకైక పక్షి.. నిమిషానికి 1200 సార్లు కొట్టుకునే గుండె.. మామూలు కథ కాదు..

పక్షి ప్రపంచంలో అతిచిన్నదైనప్పటికీ, తన అద్భుత సామర్థ్యాలతో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే అరుదైన జీవి హమ్మింగ్‌బర్డ్. చూడటానికి కేవలం తేనెటీగ పరిమాణంలో ఉండే ఈ పక్షి, పక్షి జాతిలోనే వెనక్కి ఎగరగల ఏకైక జీవిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సెకనుకు వందల సార్లు రెక్కలు కొడుతూ, నిమిషానికి 1200 సార్లకు పైగా గుండె వేగంతో ప్రకృతిలోనే ఒక వింతగా నిలిచిన హమ్మింగ్‌బర్డ్ ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వింతలకే పెద్ద వింత.. వెనక్కి ఎగిరే ఏకైక పక్షి.. నిమిషానికి 1200 సార్లు కొట్టుకునే గుండె.. మామూలు కథ కాదు..
Amazing Hummingbird Facts

Updated on: Nov 12, 2026 | 6:40 PM

పక్షి ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన, వింతైన జీవులలో హమ్మింగ్‌బర్డ్ ఒకటి. చూడటానికి చిన్నగా, ఎంతో అందంగా కనిపించే ఈ పక్షిలో ప్రకృతి దాచిన వింతలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 366 జాతుల హమ్మింగ్‌బర్డ్‌లు ఉండగా, వీటి జీవనశైలి, శారీరక నిర్మాణం శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరుస్తాయి. హమ్మింగ్‌బర్డ్ జాతులన్నింటిలో అత్యంత చిన్నది బీ హమ్మింగ్‌బర్డ్. ఇది కేవలం క్యూబా దేశంలో మాత్రమే కనిపిస్తుంది. దీని పొడవు కేవలం 5 నుండి 6 సెంటీమీటర్లు కాగా, బరువు సుమారు 2 గ్రాములు మాత్రమే ఉంటుంది. దూరం నుండి చూస్తే ఇది అచ్చం తేనెటీగలా కనిపిస్తుంది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది.

అన్ని దిశలలోనూ, తలక్రిందులుగానూ..

సాధారణంగా పక్షులన్నీ ముందుకు మాత్రమే ఎగురుతాయి. కానీ హమ్మింగ్‌బర్డ్‌లు ముందుకు, వెనక్కి, కుడికి, ఎడమకు ఇలా అన్ని దిశలలోనూ సులభంగా ఎగరగలవు. అంతేకాదు ఇవి తలక్రిందులుగా కూడా ఎగరగలవు. వీటి భుజాల కీళ్లు అత్యంత మృదువుగా, అన్ని వైపులా తిరిగేలా ఉండటం వల్లే ఈ అద్భుతం సాధ్యమవుతోంది. పక్షి జాతిలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి ఇదే కావడం విశేషం.

గాలిలో ఒకే చోట నిలకడగా..

నేషనల్ జూ నివేదిక ప్రకారం, హమ్మింగ్‌బర్డ్ గాలిలో ముందుకు కదలకుండా ఒకే చోట నిలకడగా ఉండగలదు. పూల నుండి మకరందాన్ని పీల్చుకునేటప్పుడు ఇది తన రెక్కలను ఇంగ్లీష్ అక్షరం 8 ఆకారంలో వేగంగా ఆడిస్తుంది. దీనివల్ల గాలిలో తేలుతూనే, తన పొడవైన ముక్కుతో పువ్వుల లోపలి మకరందాన్ని సులభంగా తాగుతుంది.

సెకనుకు 200 సార్లు రెక్కల కదలిక

సాధారణంగా ఎగిరేటప్పుడు హమ్మింగ్‌బర్డ్ తన రెక్కలను సెకనుకు 50 నుండి 80 సార్లు కొడుతుంది. అదే నిలువుగా కిందికి దిగే సమయంలో ఈ వేగం సెకనుకు 200 సార్ల వరకు చేరుకుంటుంది. రెక్కల వేగం ఇంత ఎక్కువగా ఉండటం వల్ల అవి ఎగిరేటప్పుడు ఒక రకమైన రొద వినిపిస్తుంది. ఆ శబ్దం కారణంగానే వీటికి హమ్మింగ్‌బర్డ్ అని పేరు పెట్టారు.

నిమిషానికి 1,200 సార్లు కొట్టుకునే గుండె

పరిమాణంలో చాలా చిన్నదైనప్పటికీ, ఎగిరే సమయంలో దీని గుండె నిమిషానికి 1,200 సార్లకు పైగా కొట్టుకుంటుంది. దీని శరీరంలో జీవక్రియ అత్యంత వేగంగా జరుగుతుంది. అందుకే దీనికి శక్తి అవసరాలు కూడా చాలా ఎక్కువ. రోజంతా కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటూ, ఏమాత్రం అలసట లేకుండా 18 నుండి 20 గంటల పాటు నిరంతరాయంగా ఎగరగల సామర్థ్యం దీని సొంతం.

రాత్రిపూట టార్పర్

పగటిపూట ఎంతో చురుగ్గా ఉండే ఈ పక్షులకు రాత్రి సమయం పెద్ద సవాలుగా మారుతుంది. రాత్రివేళల్లో మకరందం లభించకపోవడం వల్ల వాటి చిన్న శరీరాలు త్వరగా శక్తిని కోల్పోతాయి. దీనిని అధిగమించడానికి అవి రాత్రిపూట ఒక రకమైన మినీ హైబర్నేషన్ స్థితిలోకి వెళ్తాయి. ఈ సమయంలో వాటి శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, జీవక్రియ గణనీయంగా తగ్గిపోయి, ఉదయం వరకు శక్తిని ఆదా చేసుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us