
సూడాన్-ఈజిప్ట్ వివాదాస్పద సరిహద్దు జబల్ అల్-ఉకైదత్ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం తవ్వకాలు జరుపుతున్న కార్మికుల పై ఓ యుద్ధ విమానం దాడి చేసింది. ఉదయం 8 గంటల సమయంలో ఆకాశంలో విమానం కనిపించిందని వరుసగా ఐదుసార్లు జరిపిన దాడుల్లో, చాలామంది ప్రాణాలు కోల్పోయారని యూసుఫ్ అనే కార్మికుడు మీడియాకు తెలిపాడు. దాడి జరిగిన సమయంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాడి మొదలవగానే ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ తలా ఓ దిక్కుకు పరుగులు తీశారనీ చెప్పాడు.
కొంతమంది అల్-అన్సారీ మార్కెట్ వైపు వెళ్లగా.. మరికొందరు మరో దారిలో వెళ్లిపోయారనీ తాము పారిపోతున్న సమయంలో నేలపై మృతదేహాలు కనిపించాయని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని ప్రాణాలతో బయటపడిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని పట్టణాలకు చేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టే ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది.
జబల్ అల్-ఉకైదత్లో ఈ ఏడాది వైమానిక దాడి జరగడం ఇది రెండోసారి. గత జూన్లోనూ ఇదే ప్రాంతంలోని అక్రమ బంగారు తవ్వకాల గనిపై దాడి జరిగిన ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు. ఆ సమయంలో తమ దేశ సరిహద్దుల్లో అక్రమ బంగారు తవ్వకాలను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టినట్లు ఈజిప్ట్ సైన్యం ప్రకటించింది. 223 మందిని అదుపులోకి తీసుకుంది, వారిలో 136 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. అక్రమ బంగారు తవ్వకాలు, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించింది. తాజా దాడికి కూడా ఈజిప్ట్ వైమానిక దళమే కారణమని ‘ఎమర్జెన్సీ లాయర్స్’ ఆరోపించింది.
సూడాన్, ఈజిప్ట్ మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న హలాయెబ్ ట్రయాంగిల్ ప్రాంతంపై ఇరు దేశాలు హక్కులు కోరుతున్నాయి. బంగారు గనులు ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కూడా కీలకమైంది. తాజా దాడి సూడాన్ భూభాగంలో జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లోని బంగారం, ఇతర ఖనిజ సంపదపై నియంత్రణ సాధించేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
ఎర్ర సముద్రం నుంచి లిబియా వరకు సుమారు 1,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈజిప్ట్-సూడాన్ సరిహద్దు ప్రాంతంలో బంగారం అక్రమ రవాణా, మనుషుల అక్రమ రవాణా చాలా కాలంగా కొనసాగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ఈజిప్ట్ చర్యలు చేపడుతోంది.
సూడాన్లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా జీవనోపాధి కోల్పోయిన అనేకమంది ప్రమాదకరమైన బంగారు గనుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ గనుల ద్వారా లభించే బంగారం యుద్ధంలో పాల్గొంటున్న వర్గాలకు ఆర్థికంగా ఉపయోగపడుతోంది. దీంతో బంగారం తవ్వకాల ప్రాంతాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజా వైమానిక దాడి సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది.