AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లోని ‘లాల్ దర్వాజా’కు ఆ పేరు ఎలా వచ్చింది? నిజంగానే అక్కడ ఎర్రటి గేటు ఉండేదా? అసలు కథ ఇదే!

Lal Darwaza Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని ‘లాల్ దర్వాజా’కు ఆ పేరు ఎందుకు వచ్చింది? నిజాం కాలంలో అక్కడ నిజంగానే ఎర్రటి ద్వారం ఉండేదా? లాల్ దర్వాజా పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, మహంకాళి ఆలయం, బోనాల అనుబంధం గురించి తెలుసుకోండి.

హైదరాబాద్‌లోని ‘లాల్ దర్వాజా’కు ఆ పేరు ఎలా వచ్చింది? నిజంగానే అక్కడ ఎర్రటి గేటు ఉండేదా? అసలు కథ ఇదే!
Lal Darwaza Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 09, 2026 | 4:10 PM

Share

Hyderabad Lal Darwaza History Telugu: హైదరాబాద్ పాతబస్తీ అంటేనే చరిత్రకు నిలయం. చార్మినార్ నుంచి మొదలుకొని పాతబస్తీలోని అనేక ప్రాంతాల పేర్ల వెనుక ఏదో ఒక కథ ఉంటుంది. మనం రోజూ వినే లాల్ దర్వాజా పేరు వెనుక కూడా అలాంటి ఆసక్తికరమైన చరిత్రే ఉంది. అసలు ఈ ప్రాంతాన్ని లాల్ దర్వాజా అని ఎందుకు పిలుస్తారు..? అక్కడ నిజంగానే ఎర్రటి దర్వాజా ఉండేదా..? అంటే.. చరిత్రలో దొరికే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

‘లాల్’ అంటే ఎరుపు.. ‘దర్వాజా’ అంటే ద్వారం

లాల్ దర్వాజా అనే పేరులోనే దాని కథ ఉంది. ‘లాల్’ అంటే ఎరుపు. ‘దర్వాజా’ అంటే ద్వారం లేదా గేటు. నిజాం కాలంలో ఈ ప్రాంతంలోకి ప్రవేశించే చోట ఒక పెద్ద ఎర్రటి గేటు ఉండేదని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. ఆ గేటునే ప్రజలు ‘లాల్ దర్వాజా’ అంటే ‘ఎర్రటి ద్వారం’ అని పిలిచేవారు. కాలక్రమంలో గేటు పేరే చుట్టుపక్కల ప్రాంతానికి పేరుగా మారిపోయింది.

1907 ప్రాంతంలో ఈ లాల్ దర్వాజా ఏర్పాటైనట్లు అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారం చెబుతోంది. అప్పటి నిజాం పాలన సమయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. పెద్ద ఎర్రటి ద్వారం ఈ ప్రాంతానికి ల్యాండ్‌మార్క్‌గా మారడంతో.. ఎక్కడికి వెళ్లాలి అని అడిగితే ‘లాల్ దర్వాజా దగ్గరకు’ అని చెప్పడం మొదలైంది. అలా తరాలు మారినా పేరు మాత్రం అలాగే నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

అమ్మవారి ఆలయంతో మరింత గుర్తింపు

లాల్ దర్వాజా పేరు చెప్పగానే ఇప్పుడు చాలామందికి గుర్తొచ్చేది సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం. తెలంగాణలో జరిగే బోనాల ఉత్సవాల్లో లాల్ దర్వాజా బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. నిజాం కాలంలోనే ఈ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం లభించినట్లు చారిత్రక వివరాలు పేర్కొంటున్నాయి. అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆలయాలకు భూములు, విరాళాలు ఇచ్చినట్లు చారిత్రక సమాచారం చెబుతోంది. నిజాం ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా పనిచేసిన మహారాజా కిషన్ ప్రసాద్ కాలంలో లాల్ దర్వాజా ప్రాంతంలోని బోనాల ఉత్సవాలకు మరింత ప్రాచుర్యం వచ్చినట్లు వివరాలు ఉన్నాయి.

గేటు కనిపించకపోయినా.. పేరు మాత్రం మిగిలిపోయింది

కాలం మారింది.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. పాత నిర్మాణాల స్థానంలో కొత్త భవనాలు వచ్చాయి. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతానికి గుర్తింపుగా నిలిచిన ఎర్రటి ద్వారం పేరు మాత్రం చెరిగిపోలేదు. ఈరోజు ‘లాల్ దర్వాజా’ అంటే కేవలం ఒక ప్రాంతం పేరు మాత్రమే కాదు. పాత హైదరాబాద్ చరిత్ర, నిజాం కాలం నాటి ఆనవాళ్లు, మహంకాళి అమ్మవారి ఆలయం, బోనాల సంబరాలు.. ఇలా ఎన్నో జ్ఞాపకాలను తనలో దాచుకున్న పేరు. అందుకే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు చూస్తే అవి కేవలం చిరునామాలు కావు.. ఒక్కో పేరు వెనుక ఒక్కో చరిత్ర ఉంటుంది. ‘లాల్ దర్వాజా’ వెనుక ఉన్న ఆ ఎర్రటి ద్వారం కథ కూడా అలాంటిదే..!

Follow Us