
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగుచూసింది. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన సుమారు 10 మంది విద్యార్థులు కాలేజ్ ఫెస్ట్ తర్వాత రాత్రి సమయంలో మద్యం సేవించేందుకు కాలేజ్ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తారు. అయితే వారు మద్యం సేవిస్తూ ఉండగా, అటుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో.. దాన్ని చూసిన విద్యార్థులు భయపడి పక్కనే ఉన్న పొలాల్లోకి పరిగెత్తారు.
అయితే స్థానికంగా ఉండే రాజిరెడ్డి అనే రైతు సుమారు అర ఎకరం వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటలను అడవి పందుల నుంచి రక్షించేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. అయితే, పోలీసులను చూసి అటుగా పరిగెత్తుతూ వచ్చిన విద్యార్థుల్లో ఇద్దరు అడవి పందుల బెడద నివారణ కోసం పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
ఇక తోటి విద్యార్థుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 320, 330 భూముల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.