Telangana: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలకు స్పెషల్ బస్సులు..

హైదరాబాద్‌లోని అమ్మవార్లను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ట్రాఫిక్ టెన్షన్లు, సొంత వాహనాల తిప్పలు లేకుండా నగరంలోని 4 ఫేమస్ టెంపుల్స్ చుట్టివచ్చేందుకు ఆర్టీసీ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం 4 రోజుల పాటు నడిచే ఈ స్పెషల్ టెంపుల్ టూర్ బస్సుల రూట్ నంబర్లు, టైమింగ్స్ తెలిస్తే ఇప్పుడే మీ ఫ్యామిలీతో కలిసి దర్శనానికి ప్లాన్ చేసుకుంటారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.

Telangana: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలకు స్పెషల్ బస్సులు..
Tgsrtc Temple Darshan Special Buses In Hyderabad

Updated on: Oct 16, 2026 | 9:46 PM

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ అందించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా టెంపుల్స్ దర్శన్ టూర్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక బస్సులు ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నడవనున్నాయని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. నగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి, సికింద్రాబాద్ బాట మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలను ఒకే రోజులో సులభంగా దర్శించుకునేందుకు వీలుగా ఈ సర్వీసులను రూపొందించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండీ సూచించారు. ఈ ప్రత్యేక దర్శన్ టూర్ బస్సులు రెండు ప్రధాన రూట్లు ద్వారా వేర్వేరు ట్రిప్పులలో రాకపోకలు సాగిస్తాయి.

రూట్ 1: రాణిగంజ్ డిపో – సికింద్రాబాద్ మీదుగా

ఈ రూట్‌లోని బస్సులు రాణిగంజ్ డిపో నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ మీదుగా నగరంలోని ప్రధాన దేవాలయాలను కవర్ చేస్తాయి.

బయలుదేరే సమయాలు: రాణిగంజ్ డిపో నుంచి ఉదయం 6:50, 7:50, 8:50 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి.

సికింద్రాబాద్ స్టేషన్: ఉదయం 7:00, 8:00, 9:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి.

ఆలయాల దర్శన మార్గం:

  • బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
  • జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం
  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం
  • సికింద్రాబాద్ బాట మహంకాళి ఆలయం

ట్రిప్పుల వివరాలు: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రోజంతా మొత్తం 3 రౌండ్లలో ఈ బస్సులు ఆలయాల చుట్టూ తిరుగుతాయి. దర్శనాలు ముగిసిన అనంతరం సాయంత్రం 5:10, 6:10, 7:10 గంటల సమయాల్లో తిరిగి రాణిగంజ్ డిపోకు చేరుకుంటాయి.

రూట్ 2: కాచిగూడ డిపో – అఫ్జల్‌గంజ్ మీదుగా

రెండో మార్గంలోని సర్వీసులు కాచిగూడ డిపో నుంచి ప్రారంభమై అఫ్జల్‌గంజ్ మీదుగా ప్రధాన ఆలయాల వైపు సాగుతాయి.

బయలుదేరే సమయాలు: కాచిగూడ డిపో నుంచి ఉదయం 7:20, 8:20, 9:20 గంటలకు బయలుదేరుతాయి.

అఫ్జల్‌గంజ్: ఉదయం 7:30, 8:30, 9:30 గంటలకు అఫ్జల్‌గంజ్ చేరుకుంటాయి.

ఆలయాల దర్శన మార్గం:

  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం
  • జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం
  • బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
  • సికింద్రాబాద్ బాట మహంకాళి ఆలయం

ట్రిప్పుల వివరాలు: ఈ రూట్‌లోనూ రోజంతా 3 విడతల్లో బస్సులు రౌండ్లు వేస్తూ భక్తులను ఆలయాల వద్దకు చేరవేస్తాయి. దర్శనాలు పూర్తి చేసుకున్న భక్తులతో సాయంత్రం వేళల్లో తిరిగి కాచిగూడ డిపోకు చేరుకుంటాయి.

సొంత వాహనాలు, అధిక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఒకే రోజులో నగరంలోని నాలుగు ప్రధాన అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడానికి ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయి. భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆర్టీసీ అధికారులు కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us