
TG LAWCET 2026: తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్ఎల్ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ (LAWCET), టీజీ పీజీఎల్‌సెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ వేదికగా కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి షెడ్యుల్ విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ప్రవేశాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జూన్ 26 విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం టీజీ లాసెట్ (3YDC & 5YDC) కోర్సులకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్కాన్ చేసిన సర్టిఫికేట్ల అప్‌లోడింగ్ ప్రక్రియ జూలై 5, 2026 నుంచి జూలై 10, 2026 వరకు కొనసాగుతుంది. అలాగే టీజీ పీజీఎల్‌సెట్ కోర్సు అభ్యర్థులకు జూలై 27, 2026 నుంచి జూలై 31, 2026 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశాల డైరెక్టరేట్ వేదికగా భౌతిక ధృవీకరణ ప్రక్రియ జరుగుతుంది. లాసెట్ ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు జూలై 6 నుంచి జూలై 9 వరకు, పీజీఎల్‌సెట్ అభ్యర్థులకు జూలై 29 నుంచి జూలై 31 వరకు స్లాట్ బుకింగ్ ద్వారా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
లాసెట్ అభ్యర్థులు జూలై 16 నుంచి జూలై 19, 2026 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూలై 20న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. అనంతరం జూలై 24, 2026న ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 25 నుండి జూలై 28 వరకు సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు రశీదుతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు పీజీఎల్‌సెట్ అభ్యర్థులకు ఆగస్టు 1 నుండి ఆగస్టు 2, 2026 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, ఆగస్టు 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది. వీరు ఆగస్టు 5 నుండి ఆగస్టు 8, 2026 లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.