నాగార్జునసాగర్‌లో కృష్ణానది హోయలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఎన్నో ఆశలతో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చిన పర్యాటకులకు మాత్రం నిరాశ ఎదురైంది. నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారి కొత్త అందాలను సంతరించుకుంది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో కృష్ణమ్మ పరవళ్ళను చూసేందుకు పర్యాటకులు నాగార్జునసాగర్‌కు తరలివస్తున్నారు. సాగర్ వద్దకు వచ్చిన ప్రతి పర్యాటకుడు కృష్ణమ్మ అలలపై లాంచీ ప్రయాణం చేసి మధురమైన అనుభూతి పొందుతుంటారు. నాగార్జునసాగర్ నుండి నాగార్జున కొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం శాఖ లాంచీలను నిలిపి వేసింది. దీంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జున కొండను సందర్శించే అవకాశం లేకుండా పోయింది. కనీసం జాలీ ట్రిప్పులో సాగర్ జలాశయంలో విహరించే అవకాశం లేక నిరాశకు గురయ్యారు.
విజయ విహార్ నుంచి లాంచీస్టేషన్‌ను నాలుగు రోజుల క్రితం డౌన్ పార్కు వద్దకు మార్చారు. రెండు రోజుల పాటు నాగార్జునకొండ, రిజర్వాయర్‌లో జాలీ ట్రిప్పులను నిర్వహించింది. ఏమైందో ఏమో కానీ తెలంగాణ టూరిజం నుండి ఒక్కసారిగా లాంచీల రాకపోకలు నిలిచి పోయాయి. సాగర్ డ్యాం జల విన్యాసాలను చూసిన సందర్శకులు లాంచీలో విహరిద్దామని గంటల తరబడి బోటింగ్ పాయింట్ వద్ద ఎదురు చూశారు. అయితే సాగర్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా నాగార్జున కొండ, జాలీ ట్రిప్పులను నిలిపి వేయాలని అధికారులు ఆదేశించినట్టు లాంచి స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు సాధారణ రోజుల కంటే రిజర్వాయర్ పూర్తిగా నిండిన సమయంలోనే పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. సాగర్‌కు వచ్చిన ప్రతి పర్యాటకుడు.. సాగర్ జలాలపై లాంచీ విహారానికి ఇష్టపడుతుంటారు. దీంతో కొన్ని వందల మంది పర్యాటకుల కోసం నాగార్జునకొండ, జాలీ ట్రిప్పులకు తెలంగాణ పర్యాటక శాఖ లాంచీలను నడుపుతోంది. దీంతో సాధారణ రోజుల కంటే సాగర్ నిండిన సమయంలో లాంచి స్టేషన్ కు భారీగా ఆదాయం సమకూరుతోంది. రెండు రోజులుగా తెలంగాణ వైపు నుంచి నాగార్జునకొండ, జాలీ ట్రిప్పులకు లాంచీలను నిలిపియడంతో భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది తెలంగాణ టూరిజం శాఖ.
సాగర్ జలాశయంలో తెలంగాణ టూరిజం లాంచీల రాకపోకలు నిలిపివేసినా ఏపీ నుండి లాంచీలను నాగార్జున కొండకు యధావిధిగా నడుపుతోంది. ఆంధ్రా వైపు లాంచీలకు లేని వరద ప్రమాదం తెలంగాణకే ఉంటుందా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ టూరిజం లాంచీలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో సంబంధిత అధికారులపై పర్యాటకులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..