అనారోగ్యం బారిన పడి చనిపోయిన భర్తను తలుచుకుంటూ మనోవేదనకు గురవుతున్న ఆమె.. ముగ్గురు బిడ్డలను పెంచి పోషించడమెలా అన్న ఆందోళనతో కాలంగడుపుతోంది. వీటికి తోడు అత్తింటి వారు పెడుతున్న ఇబ్బందులు ఆమెకు నరకం చూపిస్తున్నాయి. చివరకు భర్త సంవత్సరీకం చేసేందుకు కూడా సహకరించకపోవడంతో ఇంటి ముందే తంతు పూర్తి చేసింది. మానవత్వపు విలువల పథనానికి నిలువుటద్దంగా నిలిచింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం జీలుగులకు చెందిన రవళికి, హుజురాబాద్ పట్టణంలోని శ్రావణ్లకు వివాహం జరిగింది.
వీరిద్దరి దాంపత్యంలో ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం కలిగింది. అనూహ్యంగా శ్రవణ్ అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలు చేయించారు. అందులో క్యాన్సర్ అని తేలింది. చికిత్స చేయించుకుంటున్న క్రమంలో శ్రవణ్ 2023 ఆగస్టు 23న మరణించాడు. పసివారైన ముగ్గురు బిడ్డల భవిష్యత్తును తలుచుకుంటూ.. భర్తను కోల్పోయిన దీనావస్థలో రవళి కొట్టుమిట్టాడుతోంది. అయితే ఇంటిని ఖాళీ చేయాల్సి రావడంతో మరోచోట రవళి తన బిడ్డలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే శ్రవణ్ మరణించిన తరువాత రవళిని మెట్టినింటి వారు ఇంటికి రానివ్వకపోవడంతో పాటు తమతో పాటు కలిసి ఉండేందుకు చొరవ చూపించలేదు.
ఆ వేదన ఆమెను మరింత మానసికంగా కలచివేసింది. ఆగస్టు 10న శనివారం తన భర్త సంవత్సరికం నిర్వహించాల్సి ఉన్నందున మెట్టినింటికి చేరుకుంది రవళికి. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. ఇంటికి తాళం వేసిన రవళి అత్తింటి వారు అక్కడ తంతు పూర్తి చేసేందుకు సహకరించలేదు. ఇప్పటికే తనకు, తన బిడ్డలకు నిలువ నీడ లేకుండా చేసిన అత్తింటి తీరుతో విసిగిపోయిన రవళి కనీసం తన భర్త పుణ్యతిథి రోజు కూడా ఇలా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు ముగ్గురు బిడ్డల బాగోగులు చూసుకోవాలని వేడుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని రవళి ఆరోపిస్తోంది. అత్త మామలు వీరగోని మొగిలి, లచ్చమ్మలు తనను ఆదరించడం కూడా లేదని, మిగతా కుటుంబ సభ్యులు కూడా తమను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని బాధను వెళ్లబుచుతోంది. తమకు న్యాయం చేయాలని, బిడ్డలను ఆదుకోవాలని బాధిత తల్లి కోరుకుంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..