Telangana: భూసమస్యలకు చెక్.. రాష్ట్రంలో భూముల రీసర్వేపై ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వే నిర్వహణపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల వారీగా భూముల కొలతల నుంచి తుది రికార్డుల ఖరారు వరకు ఆరు దశల విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది.

Telangana: భూసమస్యలకు చెక్.. రాష్ట్రంలో భూముల రీసర్వేపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Land Resurvey

Updated on: Nov 20, 2026 | 10:15 PM

తెలంగాణలో భూముల రీ సర్వే నిర్వహణకు రేవంత్ సర్కార్ కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది. గ్రామాల వారీగా భూముల సర్వే, కొలతలు, రెవెన్యూ రికార్డుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం, తుది రికార్డుల ఖరారు కోసం ఆరు దశల విధానాన్ని నిర్దేశించింది. ఈ మేరకు సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.

భూ రీ సర్వేకు ఆరు దశలు

ప్రభుత్వం నిర్దేశించిన ఆరు దశల విధానంలో భాగంగా మొదట సర్వేకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి. రెండో దశలో సర్వే ద్వారా గుర్తించిన భూమి విస్తీర్ణాన్ని రైతులకు తెలియజేయాలి. మూడో దశలో తహసీల్దార్ స్థాయిలో భూ రికార్డులను పరిశీలించి వెరిఫికేషన్ చేయాలి. నాలుగో దశలో గ్రామస్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి భూ వివాదాలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. మిగిలిన దశల్లో అభ్యంతరాలు, అప్పీళ్ల పరిష్కారం, తుది భూ రికార్డుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలి.

సర్వే విస్తీర్ణాన్ని వెంటనే రైతులకు తెలియజేయాలి

భూముల రీ సర్వే సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. సర్వే పూర్తయిన వెంటనే కొలిచిన భూమి విస్తీర్ణాన్ని సంబంధిత రైతులకు తెలియజేయాలి. పహాణీలో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో కొలిచిన విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉంటే వెంటనే పట్టాదారులకు సమాచారం ఇవ్వాలి. ఆ వ్యత్యాసాలకు గల కారణాలను ఫీల్డ్ రిజిస్టర్‌లో స్పష్టంగా నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

మూడు, నాలుగు రోజుల్లోనే వివాదాల పరిష్కారం

భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్లు గ్రామస్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. ఈ క్యాంపుల అనంతరం మూడు, నాలుగు రోజుల్లోనే భూ వివాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా రీ సర్వే ప్రక్రియలో రైతులకు ఎదురయ్యే సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

అప్పీళ్ల పరిష్కారం తర్వాతే తుది గెజిట్

సెక్షన్ 9(2) నోటీసులు జారీ చేసిన తర్వాత అప్పీళ్ల ప్రక్రియలో అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చిన అప్పీళ్లు, అభ్యంతరాలన్నింటినీ పూర్తిగా పరిష్కరించిన తర్వాతే సెక్షన్ 13 కింద తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ గెజిట్ వెలువడిన తర్వాతే ‘భూ భారతి’ ఆర్వోఆర్ (RoR) రికార్డుల సవరణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు కచ్చితంగా అమలు చేయాలని సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us