రూ.100కి చేరిన బియ్యం ధర.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అదే జరిగితే 66కే..

తెలంగాణలో సన్న బియ్యం ధరలు పెరుగుతుండటంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో పేరుతో ధరలు పెంచినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలపై 12 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

రూ.100కి చేరిన బియ్యం ధర.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.. అదే జరిగితే 66కే..
Rice Price Hike

Updated on: Oct 31, 2026 | 11:20 AM

సన్న బియ్యం ధరలు మండిపోతున్నాయి.. మేలు రకం బియ్యం 80 రూపాయల నుంచి 100కి పైగానే అమ్ముతున్నారు. అంతేకాకుండా.. బ్లాక్ మార్కెట్‌లో పాలిషింగ్ బియ్యం.. తక్కువ నాణ్యత బియ్యాన్ని ఎక్కువ రేటుకు అమ్మడం లాంటి ఘటనలు ఎక్కువయ్యాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణలో బియ్యం ధరల పెరుగుదలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఏల్‌నినో పేరుతో బియ్యం ధరలు పెంచినా, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, రైస్ మిల్లర్లతో అధికారులు జరిపిన చర్చల తర్వాత తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా.. ఎల్‌నినో ప్రభావం పేరుతో బియ్యం ధరలు పెంచితే సహించేది లేదని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. బ్లాక్‌ మార్కెటింగ్‌, అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. బీపీటీ బియ్యం కిలో ధర 66 రూపాయలకు మించకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఆర్‌ఎన్‌ఆర్ బియ్యం ధరలపైనా ప్రత్యేకంగా సమీక్షిస్తున్నామని తెలిపారు. బియ్యం ధరల నియంత్రణ కోసం ఐదు శాఖల అధికారులు సమన్వయంతో రంగంలోకి దిగారని చెప్పారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేపట్టారని తెలిపారు.

బేగంబజార్‌, నాంపల్లి, మహరాజ్‌గంజ్‌ లాంటి ప్రధాన టోకు మార్కెట్లలో నిల్వలు, విక్రయ ధరలను అధికారులు పరిశీలిస్తున్నారని.. ఈ క్రమంలోనే.. అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలపై 12 కేసులు నమోదు చేసినట్టు మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. ధరలు నియంత్రణలోకి వచ్చే వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయని మంత్రి ఉత్తమ్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు.

బియ్యం కొరత వస్తుందనే ఆందోళనతో అవసరానికి మించి కొనుగోళ్లు చేయొద్దని సూచించారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇక.. నిబంధనలు పాటించే వ్యాపారులతో చర్చలు జరుపుతామని.. అక్రమాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ హెచ్చరించారు. ఒకవైపు బియ్యం ధరల నియంత్రణ.. మరోవైపు అక్రమ నిల్వలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే.. ధరలు నియంత్రణలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మేలు రకం సన్న బియ్యం సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.. ఇంకా పకడ్బందీగా అమ్మకాలు జరిగితే రూ.66కే సన్న రకం బియ్యం దొరకుతాయని పలువురు పేర్కొంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us