
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా నదీ జలాల పంపిణీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నదీ జలాల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న వారి తీరును ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతామని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకోవడం లేదన్న బీఆర్ఎస్ విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. 2022లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే, జల్జీవన్ మిషన్ కింద రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. అప్పట్లో కేంద్రం సహకరిస్తున్నా మాజీ సీఎం కేసీఆర్ స్పందించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా కేంద్రానికి ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు.
మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2005 సెప్టెంబర్లో పోతిరెడ్డిపాడుకు సంబంధించిన జీవో 170 విడుదలయ్యే నాటికి తాను మంత్రి పదవిలో లేనని హరీశ్ రావు చెబుతున్నప్పటికీ, అంతకుముందే మార్చి నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారని సీఎం తెలిపారు. కేబినెట్ ఆమోదం తర్వాతే బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని, ఆ సమయంలో హరీశ్ రావు సహా ఐదుగురు నాటి టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. 2005లోనే హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీల నీటి తరలింపునకు అనుమతులు ఇచ్చారని సీఎం ఆరోపించారు.
కృష్ణా నదిలోని 811 టీఎంసీల నీటిలో పరివాహక ప్రాంత నిబంధనల ప్రకారం.. తెలంగాణకు 575 టీఎంసీలు దక్కాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే 2015 జూన్ 26న జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు నాటి సీఎం కేసీఆర్ అంగీకరిస్తూ సంతకం చేయడం వల్లే రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై రూ.11,255 కోట్లు, భూ నిర్వాసితుల పరిహారం కోసం రూ.3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తమ ప్రభుత్వం మూడేళ్లలోనే నిర్వాసితుల కోసం రూ.6,767 కోట్లు వెచ్చించిందని గణాంకాలతో వివరించారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను న్యాయపరంగా, చట్టబద్ధంగా అడ్డుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. పోతిరెడ్డిపాడు జీవో 170 జారీ అయ్యే సమయానికి తాము ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో లేమని, తెలంగాణ ప్రయోజనాల కోసమే పదవులకు రాజీనామా చేశామని మాజీ మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు. 2015లో కేఆర్ఎంబీ సమావేశంలో జరిగిన ఒప్పందం కేవలం తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైందని బీఆర్ఎస్ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.