
సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విందు పార్టీ చర్చనీయాంశంగా మారింది. సుమారు 100 మంది PETలు ఈ విందులో పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ సందర్భంగా కొందరు మద్యం సేవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మద్యం బంద్ ఉన్నరోజు విందు, జల్సాలు జరుపుకోవడం దుమారం రేపుతోంది.
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ జిల్లాలోని వైన్ షాపులను మూసివేసిన సమయంలోనే ఈ విందు ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా సిద్దిపేటలో క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలు ముగిసిన అనంతరం పాల్గొన్న ఉద్యోగుల కోసం విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మద్యం సరఫరా, వినియోగానికి సంబంధించిన నిబంధనలు పాటించారా? అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు బయటకు రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల విందు పార్టీపై చర్చ జరుగుతోంది. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..