Telangana: వాన లేదు.. పని లేదు.. ఇక ఈడ బ్రతికేది ఎట్టా సారూ..!

వర్షాభావం, ఉపాధి లేమి కారణంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ గిరిజనులు వలస బాట పడుతున్నారు. పిల్లా జెల్లలతో ఎడ్ల బండ్లపై జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు పయనమవుతున్న వీరి దుస్థితి హృదయ విదారకం. ఏళ్లు గడుస్తున్నా వలసల సమస్య పరిష్కారం కాకపోవడం ఆవేదన కలిగిస్తోంది.

Telangana: వాన లేదు.. పని లేదు.. ఇక ఈడ బ్రతికేది ఎట్టా సారూ..!
Narayankhed Migration

Updated on: Oct 12, 2026 | 4:05 PM

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గం తీవ్రమైన వలసల సంక్షోభంతో అల్లాడుతోంది. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతలతో పంటలు ఎండిపోవడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు కరువవడంతో వేలాది మంది గిరిజన కుటుంబాలు పొట్టకూటి కోసం వలస బాట పడుతున్నాయి. పిల్లా జెల్లలతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై సాగే ఈ వలసలు “బండి వెనక బండి కట్టి” అనే చైతన్య గీతికను గుర్తుకు తెస్తున్నాయి. తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా ఈ వలసల విపత్తుకు కళ్లెం వేయలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 167 రెవెన్యూ గ్రామాలు, 218 తండాలు ఉన్నాయి. సుమారు 70 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో, ప్రతి ఏటా చెరుకు కోత సీజన్‌ వచ్చిందంటే చాలు, తండాలు ఖాళీ అవ్వాల్సిందే. వృద్ధులు, చదువుకుంటున్న పిల్లలు తప్ప మరెవరూ కనిపించరు. కొందరు తమ పిల్లలను బడి మాన్పించి మరీ తమతో పాటు వలసకు తీసుకువెళ్తున్నారు. చక్కెర కర్మాగారాలు తెరుచుకునే సమయంలో, దళారుల ద్వారా ముందే అడ్వాన్సులు తీసుకుని కుటుంబాలతో సహా వలస వెళ్తుంటారు. నారాయణఖేడ్‌ గిరిజనులది ప్రధానంగా వర్షాధారిత వ్యవసాయం. వర్షాలు సక్రమంగా పడకపోవడం, ఉన్న కొద్దిపాటి భూమిలో పంటలు వేసినా కరెంటు సమస్యలు, వాతావరణ పరిస్థితులు తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. దీనితో చేతినిండా పనిలేక, అప్పుల పాలై, బతుకు దెరువు కోసం వలసలు అనివార్యమవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.

“మాకు ఏమీ లేవు. నీళ్లు బారట్లేదు. పొలాలు ఎండిపోతున్నాయి. 70 సంవత్సరాల వయసులో కూడా నేను చెరుకు కొట్టడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఫ్యాక్టరీ లేదు, ఏదీ లేదు. మాకు తినడానికి కూడా లేవు” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సమస్యలు వానాకాలంలోనూ, ఎండాకాలంలోనూ తమను వేధిస్తున్నాయని, అందుకే పిల్లలతో సహా చెరుకు కోతకు వెళ్తున్నామని మరొక గిరిజనుడు పేర్కొన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచే కాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలకు సైతం ఈ వలసలు సాగుతున్నాయి. వలస వెళ్లిన చోట కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నామని, అప్పుడు తమ కుటుంబాలు దిక్కు లేకుండా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వలస బాట పట్టిన వారంతా వచ్చే ఏడాది మార్చి నాటికి సొంతూళ్లకు చేరుకుంటారు. ప్రజల ఆశ ఒక్కటే. “ఈ వలసల నివారణ కోసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి తక్షణమే నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మాకు స్థానికంగా జీవనోపాధి కల్పిస్తే ఇక్కడే పనులు చేసుకుంటాం” అని తండావాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. స్థిరమైన ఉపాధి అవకాశాలు, వ్యవసాయానికి సరైన మద్దతు లేకపోవడం నారాయణఖేడ్‌ గిరిజనుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చుతోంది. ఈ సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us