Telangana: మాదిగలకు అన్యాయం చేశారంటూ ఇందిరాపార్క్‌లో మోత్కుపల్లి దీక్ష

ఒక పార్టీ.. ఒకే రోజు.. రెండు దీక్షలు. ఎన్నికల వేల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇందిరా పార్క్‌ దగ్గర దీక్ష చేపట్టారు. మరోవైపు రాజ్యాంగ రక్షణ దీక్ష పేరుతో కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో దీక్షకు దిగారు.

Telangana: మాదిగలకు అన్యాయం చేశారంటూ ఇందిరాపార్క్‌లో మోత్కుపల్లి దీక్ష
Motkupalli Narasimhulu With Other Leaders
Follow us

|

Updated on: May 04, 2024 | 7:40 PM

కీలక ఎన్నికలకు ముందు.. తెలంగాణ హస్తంలో మాదిగ రాజకీయం ముదురుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్..మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు..ఆ సామాజిక వర్గం నేతలు. రేవంత్‌ తీరుకు నిరసనగా ఇందిరాపార్క్‌ వేదికగా కాంగ్రెస్‌ నేత మోత్కుపల్లి చేపట్టిన మహాధర్నాకు.. MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు.

రేవంత్‌ పుట్టకముందే తాను ఎమ్మెల్యేనన్న మోత్కుపల్లి.. ఆయన బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అందరూ ఏకమై మాదిగ బలాన్ని చూపించాలన్నారు. ఈ సందర్భంగా కంటతడిపెట్టిన మోత్కుపల్లి.. మాదిగలను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో రేవంత్‌కు ఓటు వేస్తే మోత్కుపల్లిని చంపినట్టేనన్నారు.

మాదిగల మహాధర్నాకు మద్దతు ప్రకటించిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేతకాని. .సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్‌ సమాధి చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు మాదిగల మహాధర్నాను పక్కదారి పట్టించడానికి సీఎం రేవంత్‌రెడ్డి పోటీ దీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు..మందకృష్ణ మాదిగ.

మరోవైపు బీజేపీ మళ్లీ గెలిస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదమంటూ గాంధీ భవన్‌లో మరో దీక్ష చేపట్టారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. రాజ్యాంగ రక్షణ పేరుతో దళిత నేతలు చేపట్టిన ఈ దీక్షలో దేశ్‌కో బచావో మోదీకో హఠావో అంటూ నినాదాలు చేశారు నేతలు. మోత్కుపల్లి, మందకృష్ణ దీక్ష అర్థం లేనిదని..ఈ సందర్భంగా మండిపడ్డారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. స్వలాభం కోసమే మోత్కుపల్లి దీక్ష చేస్తున్నారని..ఆ దీక్షను మొత్తం మాదిగలకు ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో రేగిన మాదిగ సీట్ల వివాదం పార్టీని ఏమేరకు ఇబ్బంది పెడుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..