
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ఎల్నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాలు.. వెరసి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు, కుంటలు, బావులు, వాగులు నీరు లేక వెలవెలబోతున్నాయి. బోర్లు సైతం ఎండిపోతుండటంతో పంటలు సాగు చేయలేక కొందరు రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. మరోవైపు కొత్తగా బోర్లు వేయడంపైనా ఆంక్షలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం ఓ వింత దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎలాంటి మోటార్ అవసరం లేకుండానే బోర్ల నుంచి నీరు నిరంతరాయంగా పైకి ఉబికి వస్తోంది.
మోటార్ లేకుండానే జలధారలు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పూసుకుపల్లి శివారులో ఈ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా బోరు నుంచి నీటిని బయటకు తీసేందుకు మోటార్ అవసరం. కానీ ఇక్కడ మాత్రం మోటార్ ఏర్పాటు చేయకుండానే భూగర్భం నుంచి నీరు పైకి తన్నుకొస్తోంది. గత వర్షాకాలంలో రైతులు తమ పొలాల్లో మూడు బోర్లు వేయగా.. వాటి నుంచి అప్పటి నుంచి నీరు నిరంతరాయంగా ఉబికి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎండుతున్న పంటలకు జీవనాధారం!
ఓవైపు వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోతుంటే.. మరోవైపు ఈ మూడు బోర్ల నుంచి నీరు ఆగకుండా ప్రవహించడం స్థానిక రైతులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడం, సాగునీరు అందక పంటలు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో పూసుకుపల్లి శివారులోని ఈ బోర్ల నుంచి వస్తున్న నీరు పరిసర ప్రాంతాల పంట పొలాలకు ఎంతో ఉపయోగపడుతోంది.
ఏడాది పొడవునా నీటి ప్రవాహం!
ఈ బోర్ల నుంచి ఏడాది పొడవునా నీరు ఉబికి వస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎలాంటి విద్యుత్ మోటార్, డీజిల్ ఖర్చు లేకుండానే నీరు బయటకు వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం వెనుక భూగర్భ జలాల ఒత్తిడి, స్థానిక భౌగోళిక నిర్మాణం వంటి కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఎందుకు ఇలా పైకి వస్తున్నాయి? మూడు బోర్లలోనే ఈ పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది? నీటి ప్రవాహం ఎంతకాలం కొనసాగుతుంది? అనే అంశాలపై భూగర్భ జలశాఖ అధికారులు శాస్త్రీయంగా పరిశోధనలు మొదలుపెట్టారు.
మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడితో రైతులు అల్లాడుతుంటే.. పూసుకుపల్లిలో మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. స్థానిక రైతులకు వరంగా మారిన ఈ ప్రకృతి వింత ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..