
మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రేమించలేదనే కక్షతో ఓ ఉన్మాది యువతిపై కత్తితో దాడి చేసి, గొంతుకోసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. జడ్చర్లలో శనివారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
బాధితురాలు జడ్చర్లలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. గతంలో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే, కొన్నాళ్లుగా అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అతడిని దూరం పెట్టింది. అయినప్పటికీ సదరు యువకుడు ప్రేమ పేరుతో గత కొన్నేళ్లుగా ఆమెను తీవ్రంగా వేధిస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే శనివారం (మే 16) సాయంత్రం యువతి స్కూల్ ముగించుకుని బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు ఆమెను అడ్డుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. గొంతుకోసి కిరాతకంగా నరకడంతో, ఆ యువతి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కూతురు ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఈ ఘాతుకాన్ని చూసి ఆగ్రహించిన స్థానికులు, బంధువులు నిందితుడిని పట్టుకుని, తాడుతో కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య ఉన్న నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా, సదరు యువతి తన డబ్బు వాడుకుని మోసం చేయడం వల్లే ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు చెప్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..