ఆ ఉల్లి కొనేవాళ్లు లేరు..మనదేశంలో.. మన రాష్ట్రంలోనే వింత పరిస్థితి

ఇదొక వింత పరిస్థితి. దేశమంతటా ఉల్లి దిగుబడి తగ్గిపోయి రేటు అమాంతం పెరిగి ఆకాశాన్నంటితే.. ఉల్లి పండించిన రైతు జేబులు నిండాలి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పంటను కొనేవాళ్లు లేక రైతులు దిక్కులు చూస్తున్న వింత పరిస్థితి నెలకొంది. అవును. ఇదెక్కడో కాదు. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనే. రైతుల జేబు నింపాల్సిన ఉల్లి పంట వారి కంట కన్నీరు తెప్పిస్తోంది. ఇందుక్కారణం వారు సాగు చేస్తున్న ప్రత్యేక రకమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప, […]

ఆ ఉల్లి కొనేవాళ్లు లేరు..మనదేశంలో.. మన రాష్ట్రంలోనే వింత పరిస్థితి
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 18, 2020 | 5:24 PM

ఇదొక వింత పరిస్థితి. దేశమంతటా ఉల్లి దిగుబడి తగ్గిపోయి రేటు అమాంతం పెరిగి ఆకాశాన్నంటితే.. ఉల్లి పండించిన రైతు జేబులు నిండాలి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పంటను కొనేవాళ్లు లేక రైతులు దిక్కులు చూస్తున్న వింత పరిస్థితి నెలకొంది. అవును. ఇదెక్కడో కాదు. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనే. రైతుల జేబు నింపాల్సిన ఉల్లి పంట వారి కంట కన్నీరు తెప్పిస్తోంది. ఇందుక్కారణం వారు సాగు చేస్తున్న ప్రత్యేక రకమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రైతులు కృష్ణాపురం (కేపీ) రకం ఉల్లిని సాగుచేస్తారు. ఇవి పరిమాణంలో చిన్నగా, ఎరుపు రంగులో ఉంటాయి. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు.. వీటి సైజు చిన్నదే అయినా ఘాటు మాత్రం చాలా ఎక్కువ. అందుకే స్థానిక మార్కెట్లో వీటికి పెద్దగా డిమాండ్ లేదు. ఓ రకంగా అసలు డిమాండే లేదని చెప్పవచ్చు.

అయితే కృష్ణాపురం రకం ఉల్లికి సింగపూర్, హాంకాంగ్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక టన్ను ఉల్లి ధర రూ. 1 లక్ష పలుకుతోంది. అంటే ఒక కేజీ ఉల్లి రూ. 100 పలుకుందన్నమాట. అంత ఖరీదైన పంటకు దేశంలో ఎక్కడా వినియోగం లేకపోవడమే ఆ రైతుల దురదృష్టం. నిజానికి ఈ రకం ఉల్లి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నుంచే ఉందని సాగుచేస్తున్న రైతులు చెబుతున్నారు. సాధారణ ఉల్లి టన్నుకు ధర రూ. 5 వేలు పలికిన రోజుల్లోనే కేపీ రకం ఉల్లి ధర టన్నుకు రూ. 20 వేలు పలికేదని, అంటే సాధారణ ఉల్లితో పోల్చితే ఎప్పుడూ నాలుగింతలు ఎక్కువ ధర దొరికేదని రైతులు చెబుతున్నారు. దేశంలో సాధారణ ఉల్లి ధరే కిలో రూ. 100 దాటిన నేపథ్యంలో ఈ ఉల్లి రైతులకు పండిన పంట బంగారమే అవ్వాలి. కానీ పరిమాణంలో చిన్నగా ఉండడం, ఘాటు ఎక్కువగా ఉండడం కారణంగా దేశీయ మార్కెట్లో వీటిని ఎవరూ వినియోగిచడం లేదు. కేవలం తమిళనాడులో సాంబార్లో వినియోగించడానికి మాత్రమే కొనుగోలు చేస్తారని రైతులు చెబుతున్నారు.

ప్రస్తుతం దేశంలో ఉల్లి లభ్యత లేకపోవడం కారణంగా ధర విపరీతంగా పెరిగినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా విదేశాల్లో పండే ఉల్లిని దిగుమతి చేసుకోవడంతో పాటు, దేశీయంగా పండించే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. సాధారణ ఉల్లి పండించే రైతులకు ఎగుమతులపై నిషేధంతో వచ్చే నష్టమేదీ లేదు. ఎందుకంటే దేశీయ మార్కెట్లోనే ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోవడంతో వారి పంటకు స్థానికంగానే విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ కేపీ రకం ఉల్లి పండించే రైతులకు ఎగుమతుల తప్ప మరో ప్రత్యామ్నాయమేదీ లేదు. దీంతో కొనేవాళ్లు లేక, ఎగుమతులు లేక పండించిన పంట పూర్తిగా వృధా అయిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారిక అంచనాల ప్రకారం 5,000 ఎకరాల్లో కేపీ రకం ఉల్లి సాగవుతుందని, ఇప్పుడు ఈ మొత్తం పంట ఎగుమతుల్లేక నిలిచిపోయిందని చెబుతున్నారు.

ఈ కేపీ రకం ఉల్లి సాగు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. రాయలసీమకు ఆనుకునే ఉన్న దక్షిణ కర్నాటకలో కూడా ఈ ఉల్లిని బెంగళూర్ రోజ్ ఆనియన్ పేరుతో సాగు చేస్తున్నారు. అక్కడ కూడా ఇదే సమస్య తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఈ రకం ఉల్లి పంట ప్రత్యేకతను వివరించి, ఎగుమతుల నిషేధం జాబితా నుంచి ఈ రకం ఉల్లిని మినహాయించేలా చేసింది. అది కూడా రాష్ట్రంలో ఇప్పటికే నిల్వ ఉన్న ఉల్లిని ఎగుమతి చేయడానికి వీలుగా చర్యలు చేపట్టింది. ఈ తరహా చర్యలు ఆంధ్రప్రదేశ్‌కూ వర్తింపచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి తమను ఆదుకోవాలని ఏపీ రైతులు కోరుతున్నారు. కేపీ ఉల్లి రైతుల సంఘం పేరుతో ఏ. వెంకట్రామి రెడ్డి అధ్యక్షతన రైతులందరూ ఇప్పటికే రాష్ట్ర నేతలు, అధికారులను కలిశారు. ఇప్పుడు హస్తిన చేరి కేంద్ర పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

– మహాత్మ కొడియార్

సీనియర్ జర్నలిస్ట్, టీవీ9