తెలంగాణ బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్‌లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్‌ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం లేదన్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది అని కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు.. విధానం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో దళితబంధు ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. మత్స్యకారులకు భరోసా కల్పించలేదని తెలిపారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని చెప్పారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఎలాంటి లబ్ధిచేకూరలేదన్నారు.
తాము కూడా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఆరునెలలు ఆగినట్లు తెలిపారు. అందులో భాగంగానే అసెంబ్లీకి కూడా తాను రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకంపై పాలసీ చేసినట్లు ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయం రంగంపై కూడా బడ్జెట్ నిరుత్సాహపరిచే విధంగా ఉందన్నారు. తామ పరిపాలనలో రెండుసార్లు రైతుబంధు ఇచ్చామన్నారు. తమకు వ్యవసాయంపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన డబ్బులను తామేదో దుర్వినియోగం చేశామని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కానీ ఈ బడ్జెట్లో రైతుల కోసం ఎలాంటి విధానాలు ప్రకటించలేదన్నారు. ఇది పూర్తిగా రైతు శత్రుప్రభుత్వం అని తెలుస్తోందన్నారు. ఎనిమిది నెలలు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్, నీరు సరఫరా చేయలేదని విమర్శించారు. వృత్తికార్మికులను, రైతులను ఈ ప్రభుత్వం వంచించిందన్నారు. ఇండస్ట్రియల్, ఐటీ, వ్యవసాయ, అభివృద్ది పాలసీ ఏంటని నిలదీశారు. బడ్జెట్‌కు ఓ పద్ధతి పద్దు లేదన్నారు. ఇది పేదల రైతుల బడ్జెట్ కాదని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..