
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్‌రే భార్య తనూజ రంజన్ (60) హత్య కేసులో కీలక పురోగతి సాధించినట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలలుగా నిందితుల కోసం గాలిస్తున్న హైదరాబాద్ పోలీసులు తాజాగా ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీని గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలు దేశంలోని పలు ప్రధాన నగరాలతో పాటు నేపాల్లోనూ నిఘా కొనసాగిస్తున్నాయి. కల్పనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంరక్షకురాలిగా వచ్చి.. హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా!
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుటుంబానికి పరిచయమైన నేపాల్‌కు చెందిన కల్పనను.. వృద్ధురాలైన తనూజ రంజన్ సంరక్షణ కోసం పనిలోకి తీసుకున్నారు. అయితే, ఇంట్లోని నగదు, నగలను దోచుకోవాలనే పథకంలో భాగంగా నిందితులు ఆమెను ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇంటి పరిస్థితులు, కుటుంబ సభ్యుల కదలికలపై అవగాహన పెంచుకున్న నిందితులు అదును చూసి ఘాతుకానికి పాల్పడింది.
వినయ్‌రంజన్‌రే బెంగళూరుకు వెళ్లిన సమయంలో, మే 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తనూజ రంజన్‌పై దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కేసు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం ఇంట్లోని నగలను తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
నేపాల్‌కు చేరుకున్న నిందితుల ముఠా
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, వారిలో సునీల్ బహదూర్ ఔజీ (29)పై నగర పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించి జైలుకు తరలించారు. మరోవైపు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన కొందరు సిబ్బందికి ఛార్జిమెమోలు జారీ చేశారు పోలీసుల ఉన్నతాధికారులు. నేరానికి పాల్పడిన తర్వాత నేపాలీ ముఠా పోలీసులకు చిక్కకుండా బీహార్ సరిహద్దుల మీదుగా నేపాల్‌కు చేరుకున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. కల్పన నేపాల్‌లో ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని అక్కడికి పంపించారు. సుమారు రెండు నెలలుగా అక్కడే మకాం వేసిన బృందాలు ఆమె ఆచూకీని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ప్రతికూల వాతావరణం, స్థానిక పరిస్థితుల కారణంగా ఆమెను అదుపులోకి తీసుకోవడం సవాలుగా మారింది. కల్పన అరెస్టుపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన నిందితురాలిని పట్టుకుంటే హత్య వెనుక ఉన్న పూర్తి కుట్ర, ఇతరుల పాత్రపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..