
తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా సొంతింటి కల నెరవేరుస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో పర్యటించిన ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో ఇళ్లు మంజూరు చేశామని, త్వరలోనే మూడు, నాలుగో విడతల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని పేదలకు సొంతింటి కలను మరింత చేరువ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ లబ్ధిదారులకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో పేద కుటుంబాలపై రిజిస్ట్రేషన్ ఖర్చుల భారం పూర్తిగా తప్పనుంది.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్ (CORE) పరిధిలో పేదల కోసం బహుళ అంతస్తుల ఇందిరమ్మ హౌసింగ్ టవర్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా క్యూర్ పరిధిలోని రెండు కీలక ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలకు తాజాగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) నుంచి అధికారిక ఆమోదం లభించింది. మలక్‌పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్లకు రెరా అనుమతులు మంజూరు కావడంతో నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.