కరోనా(Corona) కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే.. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వంటి కారణాలతో రైళ్లు పట్టాలెక్కాయి. అయితే రైలు సర్వీసులు ప్రారంభమైనా.. రైళ్లలోని మహిళా కంపార్ట్‌మెంట్‌లను పునరుద్ధరించకపోవడంతో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తికి ముందు, అన్ని అన్‌రిజర్వ్డ్ రైలు సర్వీసుల్లో మహిళా కంపార్ట్‌మెంట్లు(Women Compartments in Trains) ఉండేవి. ప్రస్తుతం ఏ రైలులోనూ ఈ సదుపాయం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేశాఖ.. ఫస్ట్ టైమ్ తన రవాణాను కరోనా కాలంలో స్వచ్చందంగా నిలిపివేసింది. మహిళలకు కేటాయించిన ప్రత్యేక బోగీల సేవలు పూర్తి స్ధాయిలో పునరుద్దరించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల పరిధి దాటి వెళుతున్న రైళ్లలో మహిళా బోగీలు ఇంకా వేయకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే .. నేత్రావతి, శబరి, పరుశరాం, చెన్నై మెయిల్, మలబార్, మావేలి, ఐలాండ్ ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో ఇంకా లేడీస్ కంపార్టుమెంట్లను పునరుద్దరించలేదు. దీంతో చాలా అసౌకర్యం ఏర్పడుతోందని అనేక మంది అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత రైళ్ల సర్వీసులను పునరుద్దరించినా మహిళా కంపార్టుమెంట్లు తిరిగి ప్రారంభించకపోవడం ఏమిటనే ప్రశ్నలు ప్రయాణికుల నుంచి ఎదురవుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత కేవలం రిజర్వేషన్ ప్రయాణీకులకు మాత్రమే ప్రారంభమైంది. అనేక ప్యాండమిక్ నిబంధనలతో ఈ ప్రయాణాలు సాగాయి. ఆ తర్వాత సాధారణ ప్రయాణీకులు రైళ్లను సైతం ప్రారంభించారు. ఇక ప్రత్యేక కంపార్టుమెంట్ల వ్యవస్థను త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్దరించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఇందులో మహిళా కంపార్టుమెంట్లతో పాటు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కంపార్టుమెంట్లు కూడా ప్రారంభమవుతాయనే సంకేతాలు ఇస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మహిళా కంపార్టుమెంట్లను ఇప్పటికే ప్రారంభించామని సీపీఆర్వో రాకేష్ చెబుతున్నారు. ప్రతిరోజు హైదరాబాద్ మీదుగా సూపర్ పాస్ట్, ఎక్స్ ప్రెస్, పాసింజర్ ఇలా వివిధ రకాల సర్వీసుల 300 రైళ్ల వరకూ నడుస్తున్నాయని, ఇందులో సగానికి పైగా రైళ్లలో ప్రత్యేక కంపార్టుమెంట్లు ప్రారంభమయ్యాయంటున్నారు. మరో రెండు వారాల్లో నూటికి నూరు శాతం మహిళా కంపార్టుమెంట్లు తో పాటు మిగిలిన ప్రత్యేక కంపార్టుమెంట్ల సేవలు ప్రారంభమవుతాయని ఆయన టీవీ9 కు వెల్లడించారు.
– వై.గణేష్, టీవీ9 తెలుగు, హైదరాబాద్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి