సొంతింటి కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు.. మీకు రావాలంటే ఇలా చేయండి

నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లును అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఇందిరమ్మ ఇళ్లు.. ఈ పథకం కింద ఇప్పటి వరకు గ్రామాల్లోనే ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

సొంతింటి కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు.. మీకు రావాలంటే ఇలా చేయండి
Lig Indiramma Housing Scheme

Updated on: Jul 20, 2026 | 1:23 PM

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌లో నివసించే అల్పాదాయ వర్గాల కోసం క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ (LIG) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఇవాళ జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతల వివరాలతో కూడిన అధికారిక బ్రోచర్‌ను మంత్రులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. మొదటి విడతలో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని.. ఇవి ఆగస్టు నాటికి 2 లక్షలకు పైగా పూర్తి కానున్నాయని తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను ఇచ్చామని తెలిపారు. అయితే, అసలు ఇళ్ల స్థలం లేని నిరుపేదల కోసం ఇప్పుడు క్యూర్ ప్రాంతంలో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం అని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు అందేలా.. ఎలాంటి లాభాపేక్ష, స్వార్థం లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ స్థలంలోనే ఈ ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ ప్రాంతంలో గజం ధర లక్షల్లో, ఎకరం ధర వందల కోట్లలో ఉన్నప్పటికీ, వెనకడుగు వేయకుండా పేదల ఆత్మగౌరవం కోసం ఇక్కడే ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలోని 26 నియోజక వర్గాలల్లో 500 ఇళ్లను అపార్ట్‌మెంట్ తరహాలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒక్కో ఫ్లాట్ 500 చదరపు అడుగుల (SFT) వైశాల్యంలో, అన్ని వసతులతో ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ ఇండ్లకు అర్హులు ఎవరంటే.. ఏడాది ఆదయారం రూ. 6 లక్షలుగా ఉండి, సొంత ఇల్లు, స్థలం లేని వారిని ఈ పథకానికి అర్హలని తెలిపారు.

ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.11లక్షలు ఖర్చు అవుతుందని.. కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందని.. మిగతా రూ.6లక్షలు 4విడతల్లో లబ్ధిదారులు చెల్లించాలని మంత్రి పొంగులేటి తెలిపారు. దళారుల మాయమాటలకు మోసపోవద్దు.. ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఇవ్వ వద్దని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.

ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?

ఈ  ఇళ్ల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 వరకు అవకాశం ఉందన్నారు. ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవాలంటే, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు ఫారమ్‌ను ప్రజా పాలన కేంద్రాల్లో లేదా మీసేవ కేంద్రాల ద్వారా నింపి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీసేవా ద్వారా కూడా రూ.100 చెల్లించి ఇందిరమ్మ ఇళ్ల కోసం ధరకాస్తు చేసుకోవచ్చన్నారు.

అయితే  ఈ కార్యక్రమం సందర్భంగా హౌసింగ్ పథకానికి ఆకర్షణీయమైన పేరును సూచించేందుకు హౌసింగ్ బోర్డు నిర్వహించిన పేరు పెట్టు గిఫ్ట్ పట్టు కాంటెస్ట్‌లో విజయం సాధించిన వారిని మంత్రులు బహుమతిని అందజేశారు. ఈ పోలీలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పోటీలో 14 వేల మంది పాల్గొన్నగా.. వారిలో నల్గొండ జిల్లాకు చెందిన కొండా నాగరాజు విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాగరాజుకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేసి అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us