
హైదరాబాద్: అతనో వ్యాపారి.. పెళ్లి చేసుకోవాలని రెగ్యులర్‌గా మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ చూసేవాడు.. ఈ క్రమంలోనే.. ఓ మహిళ అతనికి పరిచయమైంది.. మంచిగా మాట్లాడింది.. ఇంకేముంది గురుడు ఆమె వలపు వలలో పడిపోయాడు.. చివరకు.. లక్షల రూపాయలు పొగొట్టుకుని.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన మహిళ మాటలు నమ్మి, నకిలీ ఫారెక్స్, బంగారం ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టిన హైదరాబాద్ వ్యాపారి రూ. 12.75 లక్షలు కోల్పోయారు. ఈ ఘటనపై మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగోల్‌కు చెందిన 32 ఏళ్ల వ్యాపారి ఫిబ్రవరి 19, 2025న ఒక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ రూపొందించారు. అక్కడ హైదరాబాద్‌కు చెందిన మహిళగా పరిచయం చేసుకున్న ‘దీక్ష ఎస్’ అనే వ్యక్తితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అనంతరం వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఇద్దరి మధ్య సంభాషణలు సాగాయి. బాధితుడి నమ్మకాన్ని చూరగొన్న ఆమె, `plusmartdsltd` అనే ఫారెక్స్, గోల్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. లాభాలు వస్తున్నట్లు చూపించే నకిలీ స్క్రీన్‌షాట్లను పంపి నమ్మకం కలిగించింది.
ఆమె మాటలు నమ్మి సదరు ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్ చేసుకున్న వ్యాపారి, టెలిగ్రామ్‌లోని కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ సూచనల మేరకు కొన్ని నెలల వ్యవధిలో 10 వేర్వేరు లావాదేవీల ద్వారా రూ. 12.75 లక్షలకు పైగా నగదు బదిలీ చేశారు. అయితే ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తున్న లాభాలు, తన పెట్టుబడిని విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా లావాదేవీలను నిలిపివేశారు.
డబ్బులు విత్‌డ్రా చేయాలంటే పన్నుల కోసం రూ. 3.15 లక్షలు, ఎక్స్ఛేంజ్ ఫీజు కింద మరో రూ. 3 లక్షలు అదనంగా చెల్లించాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. అదనపు సొమ్ము చెల్లించేందుకు బాధితుడు నిరాకరించారు. ఎంతకీ డబ్బు విడుదల చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన మంగళవారం మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 316(2), 319(2), 318(4), 338తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66(C), 66(D) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఈ నకిలీ ట్రేడింగ్ వేదికను నిర్వహిస్తున్న సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.