
భాగ్యనగరంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఓవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్‌తో నగరవాసులు ఇబ్బంది పడ్డారు. అత్యధికంగా బహదూర్‌పురాలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాదాపూర్‌లో 7.1 సెంటీమీటర్లు, కీసరలో 6.7, షేక్‌పేట్‌లో 6.4, చార్మినార్‌లో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈసీఎల్, కుషాయిగూడ, నేరేడుమెట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలిలోనూ వాన దంచికొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో విపరీతంగా ట్రాఫిక్ జాం అయ్యింది. భారీ వర్షంతో రహదారులు నీట మునిగాయి. ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్ లోనూ ఇదే సీన్ కనిపించింది. ఇక పాత బస్తీ చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, సంతోష్ నగర్, కాంచన్ బాగ్, బండ్ల గూడ, ఛత్రినాక, శాలిబండ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.
కృష్ణానగర్ మెయిన్ రోడ్డుపై వరద నీటిలో ఓ మందుబాబు జలకాలాడాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి, రోడ్డుపై మోకాళ్లోతు ప్రవహిస్తున్న నీటిలో పడుకుని నానా హంగామా చేశాడు. చుట్టుపక్కన వాళ్లు కేకలు వేస్తు్న్నా… పక్కనుంచే వాహనాలు వెళ్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా వరద నీటిలోనే పడుకున్నాడు. ట్రాఫిక్ పోలీసులు అతన్ని రోడ్డుపై నుంచి పక్కకు తప్పించారు.
వర్షానికి నాలాలు, కాలువలు పొంగిపొర్లాయి. మాదాపూర్ ఏరియాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో డెలివరీ బాయ్ పడిపోయిన దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటి హోరుకు అదుపుతప్పి పక్కనే ఉన్న నాలాలోకి వెళ్లిపోయాడు. పోలీసులు, SDRF సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు.