హైదరాబాద్‌కు ఎప్పటికీ త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్ ను ఎప్పటికప్పుడు నింపుతూ పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు సంయుక్తంగా సమావేశమై మంచినీటి రిజర్వాయర్, పైపులైన్ల కు సంబంధించి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పారు. హైదరాబాద్ నగరానికి మంచినీటి రిజర్వాయర్ నిర్మించే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిశోర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.