తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం ఆ భవనాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయబోమని హామీ ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ అన్నారు. తదుపరి విచారణ బుధవారం నాటికి వాయిదా పడింది.
ఈ కేసు తేలేంతవరకు సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చవద్దంటూ న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్త భవనాలతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్ళ దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కేసు తేలేంత వరకు భవనాలు కూల్చొద్దని హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని ఆయన ప్రజా విజయంగా అభివర్ణించారు.